Kishan Reddy On Lok Sabha Election Result : సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో, ఆయన సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ బీజేపీ జెండా ఎగిరిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలవలేకపోయిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శంషాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర పదాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి ఓట్లు, సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ పాలనపై సుదీర్ఘ పోరాటం చేసినట్లు తెలిపారు.
'సీఎం ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరిపై కాషాయ జెండా ఎగిరింది. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా బీజేపీ జెండా ఎగిరింది. బీజేపీ ఓటు బ్యాంకు 14 నుంచి 35 శాతానికి పెరిగింది. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలవలేక ప్రజా ఆగ్రహానికి గురైంది. రాష్ట్ర ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఎనిమిది నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.' అని కిషన్ రెడ్డి అన్నారు.
దోపిడీ చేసి దిల్లీకి పంపుతున్నారు : కాంగ్రెస్ నిరంకుశ పాలనపై విద్యార్థులు, మహిళలు పోరాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ఫిరాయింపులకు పాల్పడుతోందని రాజకీయ ఫిరాయింపులే అజెండాగా కాంగ్రెస్ పాలిస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసి దిల్లీ పెద్దలకు సూట్‌కేస్‌లు పంపుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని కాంగ్రెస్ ఆరోపిస్తోందన్న ఆయన బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటి అన్నారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపీ ఒక్కటేనని చెప్పారు. ప్రజా వ్యతిరేకతలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు.
"భూ, లిక్కర్ మాఫియాను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ప్రజలను వంచించి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పని చేస్తున్నాయి. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు లేదు. రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తారని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించలేదు. నెహ్రూ తరువాత మూడోసారి ప్రధానమంత్రి అయ్యింది నరేంద్ర మోదీ. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు." - కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి