Kishan Reddy on Amit Shah Video Morphing : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆడియో, వీడియో మార్ఫింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని కోర్టుకు ఈడుస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. అమిత్ షా పై ఫేక్ ఆడియో కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితిని తెలియజేస్తోందన్నారు.
రేవంత్ రెడ్డి మాటలతో శాంతి భద్రతలకు విఘాగతం కల్గే అవకాశముందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు తీయమనే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా స్పష్టం చేశారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని రేవంత్ రెడ్డి దిగజార్చుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల ఆరోపణలతో సీఎం విశ్వనీయత కోల్పోయారని తెలిపారు.
Kishan Reddy Comments on KCR : కృష్టా జలాల వాటాల్లో 299 టీఎంసీలకు సంతకం పెట్టిందే కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని, దానివల్ల తాను చక్రం తిప్పుతానని కేసీఆర్ కలలు కంటున్నారని తెలిపారు. కేసీఆర్ చక్రం తిప్పటం కాదు, ఆయన కుమార్తె బీరు, బ్రాందీ చక్రం తిప్పిందని ఎద్దేవా చేశారు. సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ దిల్లీలో చక్రం తిప్పుతాననటం హస్యస్పదంగా ఉందన్నారు. రిజర్వేషన్లు ఎత్తివేస్తారు, హైదారాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలోని కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులు మురుగన్ సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మంథని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారాయణరెడ్డి తదితరులు పార్టీ కండువ కప్పుకున్నారు.
"కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలను మార్ఫింగ్ చేయడం సామాన్య విషయం కాదు. రాజకీయ కోణంలోనే కాదు, దేశ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించవచ్చు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. ముఖ్యమంత్రిపై న్యాయస్థానానికి వెళ్తాం."- కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు