Kishan Reddy Comments on Congress : మోదీ, బీజేపీ ప్రభుత్వానిది బ్రిటీషర్ల విధానమని గురువారం చేవెళ్ల రోడ్‌షోలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ బ్రిటీష్ వారసత్వాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇటలీకి చెందిన సోనియా గాంధీని దేశం మీద రుద్దే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. సోనియా గాంధీని దేశ ప్రధాని కాకుండా భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం వల్లే మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేశారన్నారు. కాంగ్రెస్ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు హస్తం పార్టీకి లేదన్నారు. భారతదేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని, దరిద్ర, ఇటలీ కాంగ్రెస్‌ను దేశ ప్రజలు పదేళ్ల కింద వదిలించుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు ఉండవని కాంగ్రెస్ వితండవాదం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లిం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెంచారో చెప్పాలని ప్రశ్నించారు. జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేసిన సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని 73 ఏళ్ల పాటు జమ్మూకశ్మీర్‌లో అవమానపరిచిందన్నారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లకు గండి కొడుతుంది ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలను తీసుకొచ్చి బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందా లేదా రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రిజర్వేషన్లు తీసివేస్తుందని మతిభ్రమించి మాట్లాడుతున్నారా? మదమెక్కి మాట్లాడుతున్నారా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయాలని సవాల్ విసిరారు. సిగ్గులేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
దేశ, రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది : కిషన్‌రెడ్డి - BJP Manifesto 2024
ఏఐసీసీ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది. దేశంలో అన్ని సమస్యలకు మూలం కాంగ్రెస్ పార్టీ. దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ. దేశానికి పట్టిన దరిద్రాన్ని ప్రజలు పదేళ్ల క్రితం వదిలించుకున్నారు. బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు ఉండవని కాంగ్రెస్ పిచ్చి ప్రచారం చేస్తోంది. కనీస పరిజ్ఞానం లేనివాళ్లే రిజర్వేషన్లు రద్దు అవుతాయని మాట్లాడతారు. - కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
కనుచూపు మేరలో కూడా కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ జీవించినప్పుడు, చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు తీసివేయలేదని, ఈబీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. బీజేపీపై ఛార్జ్‌షీట్ వేస్తారా? ఆరు గ్యారంటీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌పై ఛార్జ్‌షీట్ వేయాలంటూ ధ్వజమెత్తారు. ముస్లిం రిజర్వేషన్లు కచ్చితంగా ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఒట్టు పెట్టుకుంటే ఓట్లు పడవని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎక్కడ అసమ్మతి వచ్చి తన కుర్చీకి ముప్పు వస్తుందోనని రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు.