Kishan Reddy Comments on BRS Party : మోదీ చేసిన కార్యక్రమాలు ఎజెండాగానే బీజేపీ ఎన్నికల ప్రచారం ఉంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 34 లక్షల కోట్లు సంక్షేమ పథకాలను కులమతాలకు అతీతంగా మోదీ ప్రభుత్వం అందించిందని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయంలో కనుమరుగు అవుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారత రాష్ట్ర సమితి పార్టీయేనని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
బీజేపీ ప్రచార దూకుడు- ప్రత్యర్థులే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు - bjp election campaign 2024
కేసీఆర్ తాజా పర్యటనలపై స్పందించాల్సిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం అభివృద్ధిలో వెనకబడిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి(Union Tourism Minister) అన్నారు. ఆ పార్టీ గెలుపు కోణంలో, రాజకీయ నినాదాలతో ముందుకు వెళ్లింది తప్ప, దేశ ప్రజలకు చేసిందేంలేదని విమర్శించారు. బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని పేర్కొన్నారు.
Kishan Reddy on BJP Developments : అవినీతి, అక్రమాలు, దళారులు లేని పాలన బీజేపీకే సాధ్యమన్నారు. మోదీ పాలనలో చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని చిట్టచివరగా ఉన్న వ్యక్తిని సైతం నేరుగా చేరేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఒకప్పడు మనకు ఆసరాగా నిలిచే దేశాలకు ప్రస్తుతం మనం చేయూతనందించడం గర్వకారణమని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. నీతివంతమైన,ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ప్రధాని మోదీ(PM Modi) అందించారని అన్నారు. తమ ప్రత్యర్థులు కూడా మోదీ, కేంద్ర మంత్రుల మీద ఆరోపణ చేయలేనటువంటి పాలనను అందించామని పేర్కొన్నారు.
"కేంద్ర ప్రభుత్వం చేపట్టినటు వంటి పథకాలు కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా తీసుకున్నటు వంటి అనేక నిర్ణయాలు కానీ ప్రధాన అజెండాగానే మా ఎన్నికల ప్రచారం ఉంటుంది. గత పది సంవత్సరాలుగా ఒక నీతివంతమైన, సమర్థవంతమైనటు వంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి ఇవ్వటం జరిగింది. ఎప్పడైనా కూడా కాంగ్రెస్ పార్టీ పాలనాపరమైనటు వంటి వైఫల్యాలతోని కాలం గడిపింది, రాజకీయ నినాదాలే ఇచ్చారే తప్ప ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేదు."-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల వల్ల విద్యుత్‌ను సరాసరిగా దేశ వ్యాప్తంగా 22 గంటలు అందిస్తున్నామని వివరించారు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని కొరత కూడా లేదన్న కేంద్రమంత్రి, ద్రవ్యోల్బణం తగ్గిందని పేర్కొన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులపై(National Highways) రూ.లక్షా 25 వేల కోట్లు ఖర్చు చేశామన్న కేంద్రమంత్రి, మరో లక్ష కోట్ల పనులు జరుగుతున్నాయని వివరించారు. రీజనల్ రింగ్ రోడ్‌కు సైతం రూ.26 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. కిషన్ రెడ్డి సమక్షంలో ఇవాళ బీజేపీలో కోదాడకు చెందిన వాగ్దేవి విద్యాసంస్థల యజమాని కవిత చేరారు. వారితో పాటు పలువురు నేతలు కాషాయం కండువా కప్పుకున్నారు.