MLA Danam Nagender Fires On IPS Ranganath : జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కొత్తగా వచ్చిన పోస్టు ఇష్టం లేనట్లు ఉందని, మరో మంచి పదవి కావాలని తనపై కేసు పెట్టారని అన్నారు. సిటీకి అధికారులు వస్తుంటారు పోతుంటారని, బతికినా చనిపోయినా తాను స్థానికంగా ఉంటానని తెలిపారు.
తనను ప్రజలు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, అధికారులు కాదని దానం నాగేందర్ అన్నారు. నందగిరి హిల్స్ హుడా లే ఔట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తాను అక్కడకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ జరిగిన విషయాన్ని ఐపీఎస్ రంగనాథ్ దృష్టికి తీసికెళ్లినట్లు పేర్కొన్నారు. నందగిరి హిల్స్ హుడా లే ఔట్ హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీలో ఉందని, కారంచేడులో కాదని ఎద్దేవా చేశారు.
"ప్రజల రాకపోకలకు ఇబ్బందులవుతున్నాయని మనం అలా ట్రైబల్స్‌ను అంటరానివారిలా చూడొద్దని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను. దానికి నాకు రిప్లై రాలేదు. అయితే ఒక ఎమ్మెల్యేగా ప్రజల తరఫున వారి హక్కుల కోసం అడగటం నా విధి. ప్రజా సమస్య ఎక్కడున్నా నేను వెళ్తాను. ఇలాంటివి వంద కేసులు పెట్టినా నేను వెళ్లటం ఆపను. ఈ ఘటనపై అధికారులకు నేను ప్రివిలేజ్ నోటీసులు ఇస్తాను."-దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే
Police case Registered on MLA Danam : కాగా ఈ నెల పదో తేదీన నందగిరి హిల్స్ పరిధిలోని గురుబ్రహ్మనగర్లోని సర్కార్ స్థలానికి అధికారులు ప్రహరీ కడుతుండగా, అక్కడ నివాసం ఉంటున్న గిరిజనులు అడ్డుకున్నారు. వారందరూ శాసనసభ్యుడు దానం నాగేందర్‌కు ఫిర్యాదు చేయడంతో, ఆ ప్రహరీని ఎమ్మెల్యే తొలగించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇంఛార్జి వి. పాపయ్య, ఎమ్మెల్యే దానంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తానని దానం నాగేందర్ వెల్లడించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతన్న దానం, ప్రజాప్రతినిధిగా వెళ్లిన తనను అడ్డుకునే హక్కు ఏ అధికారికి లేదని వివరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రజావ్యతిరేక విధానాలను ఎదురించినందుకు తనపై కేసులు పెట్టారని, ఇప్పుడు పెట్టిన కేసులు తనకు కొత్తేమి కాదని, ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన ఉంటానని స్పష్టం చేశారు. హిమాయత్ నగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం దానం ఈ వ్యాఖ్యలు చేశారు.