BRS Lok Sabha Candidates First List 2024 : లోక్‌సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు, ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వర రావు, కవిత పాల్గొన్నారు. 2 నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి మొదటి జాబితాను ప్రకటించారు. నాలుగు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. కరీంనగర్ నుంచి బి.వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామ నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత బీఆర్‌ఎస్ తరఫున బరిలో దిగనున్నారు.
ఈ సందర్భంగా ఓటములకు కుంగిపోవాల్సిన అవసరం లేదని, అలా కుంగిపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవారమా అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో తెలంగాణ భవన్‌లో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అన్న కేసీఆర్, ఎన్నో గొప్ప పనులు చేసిన ఎన్టీఆర్ అంతటి వారికే తప్పలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదన్న ఆయన, సర్కార్ తీరుపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని అన్నారు.
'అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత - కరీంనగర్లో బీఆర్ఎస్ - బీజేపీ మధ్యే పోటీ'
కాంగ్రెస్ నేతలు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, ఆరోపణలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అంశాల కోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదన్న కేసీఆర్, ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుందని అన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపుదామని పిలుపునిచ్చారు. ఏడాది, రెండో ఏడాది, ఐదేళ్లు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పూర్తి సిద్ధంగా ఉండాలన్న ఆయన, రాబోయే కాలం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో అద్భుతమైన అభివృద్ధి చేశామని, కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెట్టుకుందామని తెలిపారు. నేతలు కలిసికట్టుగా పని చేసి, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.
'కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెట్టుకుందాం. నేతలు కలిసికట్టుగా పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో విసుగు ప్రారంభమైంది. కాంగ్రెస్ నేతలు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారు. అంశాల కోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుంది. ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపుదాం. రాబోయే కాలం మనదే.' - కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత
ఈ క్రమంలోనే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధి రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలను సమన్వయం చేసుకోవాలని చెప్పారు. రెండు నియోజకవర్గాల సిట్టింగ్ ఎంపీలపై నేతల నుంచి కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నారు. నామ నాగేశ్వర రావు, మాలోత్ కవిత అభ్యర్థిత్వాలపై సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
మేడిగడ్డపై దుష్ప్రచారాన్ని ఆపి - వర్షాకాలంలోపు మరమ్మతులు చేపట్టండి : బీఆర్ఎస్