KCR Meeting in Telangana Bhavan Review Lok Sabha Polls : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌లపై మండిపడ్డారు. హస్తం పార్టీ ప్రభుత్వ అసమర్థత వల్ల సాగునీరు, తాగునీరు, కరెంట్ ప్రజలకు అందించలేకపోతోందని ఆరోపించారు. ప్రజలకందాల్సిన మౌలిక వసతులకు గత పదేళ్ల కాలంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తిందని కేసీఆర్ ప్రశ్నించారు.
BRS Strategy on Parliament Elections 2024 : ప్రజలు, రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్యం, అశ్రద్ధ ధోరణులే ఇందుకు కారణమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. హస్తం పార్టీ ప్రభుత్వంపై నాలుగు నెలలకే వారు విసిగి వేసారిపోయారన్నారు. మాయమాటలు చెప్పి నేడు ప్రజలను మోసం చేస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
అద్భుతమైన తెలంగాణ - 100 రోజుల్లోనే అస్తవ్యస్తమవుతుందని భావించలేదు : కేసీఆర్ - KCR Fires on Congress
రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం : ధాన్యం కొనుగోలు కోసం గత సర్కార్ అమలు చేసిన విధానం, పకడ్బందీ చర్యలను యధాతథంగా అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ ఆక్షేపించారు. నిర్లక్ష్యంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తూ అన్నదాతలకు నష్టం చేస్తోందని దుయ్యబట్టారు. రైతాంగం సమస్యలు, రూ.500 బోనస్ సహా ఎగొట్టిన హామీల అమలు డిమాండ్‌తో ముఖ్యమంత్రికి నియోజకవర్గాల వారీగా లక్షలాదిగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ప్రజల హక్కులను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే : తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనన్న కేసీఆర్, ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించటం ద్వారా కాంగ్రెస్ అసమర్థత పాలనను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ పాలన కొనసాగించాలనుకుంటున్న హస్తం పార్టీ కుయుక్తులను ప్రజలు పసిగడుతున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడు పియర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని అబద్ధాలు, కట్టుకథలతో ప్రజలను ఇన్నాళ్లు మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్, కాఫర్ డ్యాం కట్టాలని నిర్ణయించటం గులాబీ పార్టీ సాధించిన విజయమని కేసీఆర్ పేర్కొన్నారు.
KCR Comments on BJP : గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్ట్ కట్టి తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాల్ని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు మళ్లించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఇది బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమన్న ఆయన తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టే కుట్రలకు బీజేపీ సిద్ధమైందని దుయ్యబట్టారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు.
ట్రైబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం ముందుకు పోతుంటే అడ్డుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు. ఇది తెలంగాణ సర్కార్ అసమర్థతా కాదా అని నిలదీశారు. తెలంగాణ నదీ జలాలు కాపాడాలంటే కేవలం బీఆర్ఎస్ వస్తేనే సాధ్యమని, ఎంపీలు, పార్టీ శ్రేణులు కొట్లాడైన రాష్ట్రానికి చెందాల్సిన నదీ జలాలను కాపాడుకుంటామని చెప్పారు. ఇవన్నీ ఆలోచించి ప్రజలు గులాబీ పార్టీ ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.
బీజేపీకి ఎందుకు ఓటు వేయకూడదో వంద కారణాలున్నాయి : బీజేపీకి ఎందుకు ఓటు వేయకూడదో వంద కారణాలున్నాయని కేసీఆర్ తెలిపారు. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లిస్తున్నందుకా? కృష్ణా నది మీద ప్రాజెక్ట్‌లను కేఆర్ఎంబీకి అప్పగించినందుకా? ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినందుకా? తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టుమన్నందుకా? ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వనందుకా? ఎందుకు ఓటు వేయాలో ప్రజాక్షేత్రంలో కమలం పార్టీ నేతలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పరిస్థితి క్షేత్ర స్థాయిలో దారుణంగా పడిపోయిందని సర్వేలు చెబుతున్నాయని వివరించారు. ఆ పార్టీపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు పట్ల సానుకూల వాతావారణం నెలకొందని కేసీఆర్ వివరించారు.
KCR on MLC Kavitha Arrest : ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారన్న కేసీఆర్, దిల్లీ మద్యం కేసు పేరుతో సాగుతున్న వ్యవహారం అసలు ఓ కేసే కాదని, అందులో ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇది కక్షసాధింపు చర్యేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కమలం పార్టీ కుట్రలను భగ్నం చేసి, కుట్రదారులను వల వేసి పట్టుకున్నామని చెప్పారు. బీఎల్ సంతోష్ వంటి కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత కుట్రలో భాగస్వామిగా ఉండడంతో వదిలిపెట్టలేదని వివరించారు. దీంతో భారతీయ జనతా పార్టీ కక్ష పెంచుకున్నదని తెలిపారు. బీఎల్ సంతోష్‌కు నోటీసులు పంపినందుకు ప్రతీకారంగా అక్రమ కేసు బనాయించి కవితను అరెస్ట్ చేశారని కేసీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీతోనే ముప్పు : మజ్లిస్‌తో కలిపి 111 సీట్లతో పటిష్ఠంగా ఉన్న బీఆర్ఎస్ సర్కార్‌ను కూలగొట్టాలని ప్రయత్నం చేసిన బీజేపీ, అత్తెసరు మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చకుండా వదులుతుందా? అన్న అనుమానాలు సర్వత్రా వెల్లువెత్తున్నాయని కేసీఆర్ అన్నారు. హస్తం పార్టీ ప్రభుత్వానికి ఏదైనా ముప్పు పొంచి ఉందంటే, అది కమలం పార్టీ నుంచి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదంతో ముందుకు వస్తున్న మోదీ, హస్తం పార్టీ ప్రభుత్వాలను ఖతం చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కొట్లాటతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ గందరగోళ పరిస్థితిని తట్టుకొని, రాష్ట్రం రాజకీయ అస్థిరతకు లోనుకాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలని స్పష్టం చేశారు. అందుకు ప్రజల పూర్తి మద్దతు ఉంటుందని తమకు విశ్వాసం ఉందని కేసీఆర్ తెలిపారు.
ఏడాదిలోగా శాసనసభ రద్దయ్యే అవకాశాలు : ఏడాదిలోగా శాసనసభ రద్దయ్యే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారని కేసీఆర్ సమావేశంలో తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌దే భవిష్యత్ అని, గులాబీ పార్టీ బీ ఫామ్‌పై పోటీ చేసేవాళ్లు అదృష్టవంతులు అవుతారని అన్నారు. వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్తపుణ్యానికి గెలుస్తారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు స్థిరచిత్తంతో ఉండాలని సూచించారు. కొద్దిమంది నేతలు వెళ్లిపోయిన అంత మాత్రాన ఇబ్బందేమీ లేదని కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లోకి పోయిన నేతలు ఇప్పుడు బాధపడుతున్నారని, అక్కడ పూర్తిగా బీజేపీ ఎజెండా అమలవుతోందని వ్యాఖ్యానిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. రేవంత్‌రెడ్డి కమలం పార్టీలోకి పోతే కరుడుగట్టిన హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇవ్వబోరని వివరించారు. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో తాను మాట్లాడానని, కాంగ్రెస్‌ను నమ్మడం లేదని తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. కొంతమంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అన్నారు.
KCR Bus Yatra Across Telangana : ఈ నెల చివరివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం పూట రైతాంగ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను సందర్శిస్తూ, అన్నదాతలను పరామర్శిస్తూ, వారి కష్టనష్టాలను తెలుసుకుంటానని చెప్పారు. సాయంత్రం పూట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నుంచి నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకొని బస్సుయాత్ర కొనసాగనుందని తెలిపారు. ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రెండు, మూడు వారాల పాటు ఈ యాత్ర కొనసాగనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, భారత్ రాష్ట్ర సమితి కార్యకర్తలను అక్రమ అరెస్ట్‌లు చేస్తూ భయాభ్రాంతులకు గురి చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. దీనిపై పోరాడేందుకు లీగల్ సెల్‌ను ఇప్పటికే పటిష్ఠం చేసినట్లు తెలిపారు. కేసులను ఎదుర్కొనేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనకడాకుండా శ్రేణులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.10 కోట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు కేటాయించారు. ఎలాంటి న్యాయపరమైన సేవలైనా అందించేందుకు పార్టీ సీనియర్ అడ్వకేట్లు సోమా భరత్ కుమార్, మోహన్‌రావులతో కూడిన న్యాయవాదుల బృందం నిరంతరం అందుబాటులో ఉంటుందని కేసీఆర్ వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు: కేసీఆర్ - BRS Lok Sabha Election Campaign
తెలంగాణ ప్రజల కోసం బతికున్నంత వరకు పోరాడుతూనే ఉంటా : కేసీఆర్ - BRS Praja Ashirwada Sabha