BRS Praja Ashirwada Sabha Sangareddy : మెతుకుసీమ వేదికగా గులాబీబాస్, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలదాడి చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరయ్యారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్‌లో గులాబీ సభ్యులు ఉండాలన్నారు. మెదక్ జిల్లా ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించానన్నారు.
అంబేడ్కర్‌ను అవమానిస్తే, చూస్తూ కూర్చుందామా? : హైదరాబాద్‌లో బీఆర్ఎస్ హయాంలో భారీ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే, ఆయన జయంతి వేళ ప్రస్తుత పాలకులు కనీసం అక్కడ పుష్పాంజలి ఘటించలేదని మండిపడ్డారు. అలాంటప్పుడు తమ ప్రభుత్వం నిర్మించిన సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. యాదాద్రి ఆలయం తానే నిర్మించానని, మరి మూసేస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. అంబేడ్కర్‌ను అవమానిస్తే చూస్తూ కూర్చుందామా అన్న ఆయన, అవమానించిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.
"రాజకీయాల్లో అప్పడప్పుడూ గమ్మత్తుగా గుడ్డిలక్ష్మి వచ్చినట్లు, కొంతమంది లిల్లీపుట్టుగాళ్లకు కూడా అధికారం వస్తుంటుంది. రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహం నిర్మించిన అనంతరం జరిగిన తొలి జయంతి రోజున, కనీసం ఒక్క కాంగ్రెస్ నేత పుష్పాంజలి ఘటించలేదు. రాష్ట్ర సర్కార్ పోలేదు. అనేక రాష్ట్రాల నుంచి విగ్రహం వద్దకు ప్రజలు వచ్చారు కానీ వారికి కనీసం తాగునీటి సదుపాయం కల్పించలేదు. ఇంకా గేట్లు బంద్ చేసి తాళాలు వేశారు."-కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
KCR Comments On CM Revanth Reddy : బహిరంగసభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలోచించకుండా ఓటు వేసి ఇప్పటికే దెబ్బతిన్నామన్న కేసీఆర్, ప్రజాస్వామ్యంలో బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తాము కడుపులో పెట్టుకుని కాపాడుకున్న రైతులు ఇవాళ ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, సాగుకు కరెంటు లేదు అని విమర్శించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే, డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామన్నారని, నాలుగు నెలలు గడిచినా నేటికీ చేయలేదని కేసీఆర్ ఆక్షేపించారు. మళ్లీ, ఆగస్టు 15లోపు అంటున్నారని కాంగ్రెస్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేయాలన్న డిమాండ్ చేసిన ఆయన, దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేద్దామన్నారు. రుణమాఫీ, వరికి బోనస్ కోసం పోస్టుకార్డు ఉద్యమం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు : కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండాలి. అప్పుడే మంచి, చెడుకి మధ్య తేడా తెలుస్తుంది. కానీ, ఈ కాంగ్రెస్ సర్కార్ ఏడాది కూడా ఉండేలా లేదు. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరుతారో తెలియదని, స్వయంగా ముఖ్యమంత్రే జంప్ కొడతారేమో తెలియదని విమర్శించారు. కమలానికి ఓటు వేసినా, మంజీరా నదిలో వేసిన ఒకటేనన్న ఆయన, బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం, దాన్ని వదిలేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువస్తానని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల కోసం గులాబీ జెండా మాత్రమే పోరాడుతుందన్నారు.