KCR at Telangana Bhavan Today 2024 : మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) 3 నెలల విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వెళ్లారు. పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు ఆయన రావడంతో కేసీఆర్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం - పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు
BRS Meeting at Telangana Bhavan : కృష్ణా జలాల అంశానికి సంబంధించిన కార్యాచరణపై కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలు పాల్గొన్నారు. కృష్ణా జలాల అంశంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
నేడు తెలంగాణ భవన్‌కు కేసీఆర్ - ఘనస్వాగతం పలికేందుకు శ్రేణుల ఏర్పాట్లు
Harish Rao Reaction on KCR Telangana Bhavan : కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ ఇకపై చూస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీకి కూడా వస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కచ్చితంగా నిలదీస్తామని తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్‌కు(Telangana Bhavan) కేసీఆర్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. తిట్ల కోసమా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడిన భాష మంచిది కాదని మండిపడ్డారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరగబడి, నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
"డిసెంబర్ 9న రుణమాఫీ, ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్- 1 నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వారే తేదీలను ఫిక్స్ చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. వారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయారు. దీంతో ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆటో కార్మికులను రోడ్డు మీదకు తెచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ కోతలు పెరిగాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పులు. కేసీఆర్ అసెంబ్లీకి కూడా వస్తారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన పోరాటం చూస్తారు." - హరీశ్ రావు, మాజీ మంత్రి