kadiyam Srihari Fires On Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు అంశం అజెండాలో లేకున్నా రేవంత్ రెడ్డి మాట్లాడి, కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. దీనిపై అభ్యంతరం చెప్పేందుకు తాము స్పీకర్‌ను పదే పదే కోరినా కనీసం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. సీఎం మాట్లాడిన తర్వాత కూడా తమకు అవకాశం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. తమను తిట్టే వాళ్లకు మాత్రం మైకు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రగతి భవన్ వద్ద కంచెలు తొలగించామని భుజాలు తడుముకున్న కాంగ్రెస్ నేతలు, అసెంబ్లీ వద్ద ప్రధాన ప్రతిపక్ష నేతలకే కంచెలు వేశారని ఆక్షేపించారు.
అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, బయట మాట్లాడదామని ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ భవన్‌లో అయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్ రెడ్డి తదితర ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. అసెంబ్లీ అవరణలో ఎమ్మెల్యేలకు ఎక్కడైనా తిరిగే అవకాశం ఉందని ఉద్ఘాటించారు. మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడటం ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ అని అన్నారు. ప్రజాస్వామ్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని గొప్పలు చెప్పే వాళ్లు చరిత్రలో లేని విధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
kadiyam Srihari Fires On Congress : బడ్జెట్లో ఉన్న లొసుగులను ఎత్తి చూపుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇలా వ్యవహరించారని కడియం శ్రీహరి అన్నారు. స్పీకర్ తమను రమ్మన్నారని, తమపై అసభ్య పదజాలంతో మాట్లాడిన తర్వాత కనీసం అవకాశం ఇవ్వకుండా చేయడం వల్లే తాము ఒప్పుకొలేదని వివరించారు. అసెంబ్లీ నుంచి ఎందుకు వాకౌట్ చేశామనేది చెప్పడానికే విలేకరుల సమావేశం పెట్టామని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ సమావేశాలను పక్కదారి పట్టించారని ఆరోపించారు.
తెలంగాణ భాష పేరుతో రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను తిడుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష చంద్రబాబు ప్రోద్భలంతో కొనసాగుతోందని ఆరోపించారు. ప్రగతి భవన్ వద్ద తీసిన కంచెలు రేవంత్ రెడ్డి ఇల్లు, అసెంబ్లీ చుట్టూ వేశారని తెలిపారు.
'అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బడ్జెట్‌కు సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ అసభ్య పదజాలంతో కేసీఆర్‌ను దూషించారు. మంత్రి శ్రీధర్ బాబు ఒకవైపు సభను హుందాగా నడుపుతామని అని, మరోవైపు స్పీకర్ అడగని సభ్యలకు కూడా మైక్ ఇచ్చి మాపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు' - కడియం శ్రీహరి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - సభ నుంచి వాకౌట్
కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఘాటు కామెంట్స్ - సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్