Junior NTR Reacts on AP Election Results: ఏపీలో మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులు ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించారు. ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు అనేకమంది మంగళవారం నుంచే అభినందనలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయదుందుభి మోగించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను అభినందిస్తూ విషెస్ తెలుపుతున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నేడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రియమైన మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చంద్రబాబుకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. చంద్రబాబు విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేశ్, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణకు, ఎంపీలుగా గెలిచిన భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తారక్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కూటమి విజయం పట్ల ఎన్టీఆర్ స్పందించడంతో తెలుగుదేశం అభిమానులు, జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు నందమూరి కల్యాణ్ రామ్ కూడా చంద్రబాబు విజయంపై స్పందించారు. చంద్రబాబు కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ ట్వీట్ చేశారు. చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబుకు, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
Maheshbabu Wishes to Chandrababu and Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సినీ నటుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పవన్ మీద పెట్టుకున్న నమ్మకానికి, విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. చంద్రబూబుకు అభినందనలు తెలుపుతూ ప్రజల కలను సాకారం చేయటం కోసం ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధితో పాటు శ్రేయస్సుతో నిండిన విజయవంతమైన పదవీ కాలం కావాలని కోరుకుంటున్నానన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని, యువత ఆకాంక్షలను నెరవేర్చుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.