Joinings in Congress Party : తెలంగాణ రాష్ట్రంలో లోకసభ ఎన్నికల వేడి రోజువారీ రాజకీయ పరిణామాలను మార్చేస్తోంది. బీఆర్‌ఎస్(BRS), బీజేపీలు ఇప్పటికే ఎంపీ ఎన్నికలకు ఎక్కువ మంది అభ్యర్ధులను ప్రకటించగా, కాంగ్రెస్ మాత్రం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మిగిలిన 13 లోకసభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించేందుకు, రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం లేని లోకసభ సిట్టింగ్ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
మల్కాజిగిరి స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ నుంచి బలమైన అభ్యర్ధిని బరిలో దించేందుకు గత కొన్నిరోజులుగా కసరత్తు చేస్తున్నరేవంత్ రెడ్డి, పార్టీలోకి వచ్చేవారికి గేట్లు తెరవాలని నిర్ణయించారు. ఇవాళ బీఆర్‌ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని, ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లను పార్టీలోకి చేర్చుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Congress Master Plan on Joinings : ఇప్పటి వరకు మాజీలకు మాత్రమే గేట్లు తెరచిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో సిట్టింగ్‌లకు కూడా ద్వారాలను బారుగా తెరిచారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బొంతు రామ్మోహన్, హైదరాబాద్ నగర మాజీ మేయర్, ఆయన భార్య శ్రీదేవిలు చేరారు. అదేవిధంగా రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ అనితా రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిలు పార్టీలో చేరారు.
అప్పట్లో చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్‌లను రంగంలోకి దించాలని పార్టీ నాయకత్వం భావించింది. కాని మారిన, మారుతున్న రాజకీయ సమీకరణాలతో అభ్యర్ధుల విషయంలో పార్టీ నిర్ణయాలు మారుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లో చేరడంతో, పార్టీ సమీకరణాలు మారినట్లయింది.
చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని పోటీలో నిలపడం, అక్కడ నుంచి పోటీ చేయించాలని యోచించిన సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్ల తెలుస్తోంది. మరొకవైపు సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోన్ బదులు దానం నాగేందర్‌ను బరిలో దించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రెండు లోకసభ స్థానాలకు అభ్యర్ధుల సర్దుబాటు జరిగిందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పార్టీ దర్వాజలు బార్లా తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో, అటు బీఆర్‌ఎస్, ఇటు బీజేపీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి టచ్‌లో ఉంటున్నారు. ఈ సందర్భంలో ఎంత మంది కాంగ్రెస్‌పార్టీలో చేరతారన్న విషయం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు తెరలేపింది. ఇప్పటి నుంచి తాను పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించడంతో చేరికల ప్రక్రియ మరింత ఊపందుకుంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బీఆర్ఎస్కు మరో షాక్ - కాంగ్రెస్ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్