Pawan Kalyan Election Campaign: వైఎస్సార్సీపీ ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిసగా చేస్తోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఏలూరు జిల్లాలోని కైకలూరులో వారాహి విజయభేరి సభలో పవన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన జగన్ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయని, జర్నలిస్టులపై 430 కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పత్రికలు, ఛానళ్లను కట్టడి చేసేందుకు జీవో నెం.1 తీసుకొచ్చి భయపెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే జర్నలిస్టులకు న్యాయం జరిగేలా భద్రత కల్పిస్తామన్నారు.
దీంతోపాటు ప్రజల భూములను దోచేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. మన ఆస్తిని మనదని రుజువు చేసుకోవాలా? అని ప్రశ్నించిన ఆయన 90 రోజుల్లో రుజువు చేసుకోలేకపోతే దోచుకుంటారా? అని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల భూములను కాజేసే ఈ దుర్మార్గ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. జనం సొమ్ము దోచుకోవడం కాదు, వాళ్లకు పంచిపెట్టాలన్న ఆయన రాష్ట్రంలో సమస్యల పరిష్కార బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.
ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికుల కోసం గళమెత్తింది జనసేనే అన్నారు. ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలంతా భయపడకుండా బతకాలని కోరుకుంటున్నామన్న ఆయన వైఎస్సార్సీపీ దుర్మార్గ పాలనపై ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని పవన్ కల్యాణ్ కోరారు.
"వైఎస్సార్సీపీ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. వారిపై 430 కేసులు నమోదు చేశారు. పత్రికలు, ఛానళ్లను కట్టడి చేసేందుకు జీవో నెం.1 తీసుకొచ్చి భయపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు న్యాయం జరిగేలా భద్రత కల్పిస్తాం. మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్ యువతను గంజాయి మత్తుకు బానిస చేస్తున్నారు. జనం సొమ్ము దోచుకోవడం కాదు.. వాళ్లకు పంచిపెట్టాలి. భూములను దోచేసే చట్టం తీసుకొచ్చారు.. అసెంబ్లీలో చర్చ లేదు. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా?. 90 రోజుల్లో రుజువు చేసుకోలేకపోతే దోచుకుంటారా?. ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. భవన నిర్మాణ కార్మికుల కోసం గళమెత్తింది జనసేనే. సమస్యల పరిష్కార బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నిర్ణయం మీది.. ఓటు వేసేముందు జాగ్రత్తగా ఆలోచించాలి." - పవన్ కల్యాణ్, జనసేన అధినేత
Pawan Kalyan Election Campaign at Giddalur: అనంతరం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వారాహి విజయభేరి సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లపాటు వైఎస్సార్సీపీ అరాచక పాలన కొనసాగించిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల్లా మార్చారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ గూండాలను జనసైనికులు గుండె బలంతో ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధి లేకపోవటంతో ప్రజలు వలసలు పోతున్నారన్న ఆయన ఈ పరిస్థితి ఆగాలంటే పరిశ్రమలు రావాలన్నారు.
అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తామన్నారు. దీంతోపాటు గిద్దలూరును పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు రూ.1,200 కోట్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు.
"జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఐదేళ్లపాటు అరాచక పాలన కొనసాగించింది. పోలీసులను వైఎస్సార్సీపీ కార్యకర్తల్లా మార్చారు. వైఎస్సార్సీపీ గూండాలను జనసైనికులు గుండె బలంతో ఎదుర్కొన్నారు. జిల్లాలో ఉపాధి లేకపోవటంతో ప్రజలు వలసలు పోతున్నారు. ఈ పరిస్థితి ఆగాలంటే పరిశ్రమలు రావాలి. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తాం." - పవన్ కల్యాణ్, జనసేన అధినేత