Internal Conflicts Between Kishan Reddy And BJP MLAs : శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిలో రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి మినహా మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు చట్ట సభల్లోకి కొత్తగా అడుగుపెట్టిన వాళ్లే. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో పార్టీ నుంచి ఏయే అంశాలు ప్రస్తావించాలి? ఏయే హామీలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలనే అంశాలపై సబ్జెక్ట్ అందించే సహకారం కూడా ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిన తరువాత కాషాయపార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఓట్లు, సీట్లు పెంచుకుని అధికార పార్టీకి ధీటుగా ఎదిగింది. ఈ ఊపును అందిపుచ్చుకోవాల్సింది పోయి అందుకు భిన్నంగా తయారైంది. పార్టీ పూర్తీగా సైలెంట్ అయిపోయింది. ఎమ్మెల్యేలను సైతం పట్టించుకోవడంలేదనే వాదన పార్టీలో వినిపిస్తోంది.
పట్టించుకునే పరిస్థితి లేదు : అసెంబ్లీ సమావేశాలు అనగానే ఇతర పార్టీల్లో పలు అంశాలపై సబ్జెక్ట్ అందించడంతో పాటు ఎలా వ్యవహరించాలి, ఏయే అంశాలను లేవనెత్తాలనే విషయాలపై దిశానిర్దేశం చేస్తారు. కానీ రాష్ట్ర బీజేపీలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమే సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వగా బీజేపీలో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించలేదు.
తెలంగాణ కాషాయ పార్టీలో అధికార ప్రతినిధుల జాబితా చెప్పుకోవడానికి పెద్దగా ఉన్నా రాష్ట్ర నాయకులకు కనీసం సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో కమలం పార్టీ నేతలు అంతర్గత విబేధాలతో రగిలిపోతున్నారు. ఎవరికి వారే యమునాతీరం అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు రాష్ట్ర నాయకత్వం సరైన ప్రోత్సాహం అందించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాషాయపార్టీ నేతలు ఓన్ చేసుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కార్యక్రమాలకు ఎమ్మెల్యేలకు లేని పిలుపు : ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానకి సంబంధించి ఎమ్మెల్యేలకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతులు అంటూ విడుదల చేసిన పోస్టర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కిషన్ రెడ్డి పొటో తప్ప మిగతా వారి ఫోటోలు కూడా ముద్రించలేదు. మంగళవారం జరిగిన రాష్ర్ట పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశానికి కూడా ఎమ్మెల్యేలందరీకి సమాచారం ఇవ్వలేదని ప్రచారం నడుస్తోంది.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాత్రమే రాష్ట్ర పదాధికారుల సమావేశానికి హాజరయ్యారు. మిగతా ఎమ్మెల్యేలు సమావేశానికి ఎందుకు రాలేదు? సమాచారం ఇచ్చారా అనే ప్రశ్నలకు రాష్ట్ర పార్టీ నుంచి సమాధానం లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్క పార్టీలో ఇంతా జరగుతుంటే జాతీయ నాయకత్వం ఏం చేస్తుంది? ఈ అనిశ్చితి అధిష్టానం దృష్టికి వెళ్లిందా లేదా అనేది పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం మేలుకోని పరిస్థితిని చక్కబెట్టాలని లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.