Huge Competition for Khammam Congress Lok Sabha Ticket : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, గాంధీ భవన్ వేదికగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ(PEC)భేటీ అయింది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరి, కమిటీ సభ్యురాలు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఇతర ముఖ్య నేతలంతా ఆశావహుల వివరాలు పరిశీలించారు. ఈ మేరకు ఖమ్మం లోక్‌సభ బరిలో నిలిచేందుకు ఈ సారీ నేతలు పోటీపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు.
పార్లమెంట్ బరిలో నిలిచేందుకు మొత్తం 12 మంది నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఇప్పటికే జిల్లా పార్టీ తీర్మానించి రాష్ట్ర పార్టీకి ప్రతిపాదనలు పంపింది. దీంతో ఖమ్మం బరిలో ఎవరు నిలుస్తారు, అధిష్ఠానం ఎవరి అభ్యర్థిత్వం ఖరారు చేస్తుందన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న అంశం. టికెట్ ఆశిస్తున్న వారిలో ముగ్గురి పేర్లతో పీఈసీ త్వరలోనే అధిష్ఠానానికి ప్రతిపాదించనుంది. పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, వి.హనుమంతరావు సీటు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు.
ఖమ్మం లోక్‌సభ స్థానంపై పోటాపోటీ : ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల కుటుంబ సభ్యులు సైతం టికెట్ రేసులో ప్రధానంగా ఉన్నారు. ఏళ్లుగా పార్టీకి విధేయంగా పనిచేస్తున్న తమకు అవకాశం కల్పించాలంటూ రాయల నాగేశ్వరరావు, వంకాయల పాటి రాజేంద్ర ప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు, మద్ది శ్రీనివాస్ రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఎవరికి వారే టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాలకు అన్నింటిలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భారీ ఆధిక్యాలు లభించాయి. దీంతో లోక్‌సభ స్థానం కోసం పోటీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కించుకుంటే చాలు సగం విజయం సాధించినట్టేనని నేతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎంపీ అభ్యర్థిత్వం కోసం ఎవరికి వారే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఖమ్మం బరిలో నిలిస్తే ఆమె ఘన విజయం దక్కేలా పనిచేస్తామని ఆశావహులంతా ప్రకటించారు. ఒకవేళ ఆమె పోటీలో లేని పక్షంలో తమకంటే తమకు సీటు కేటాయించాలని రాష్ట్ర పార్టీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తీవ్రం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ ఆశిస్తూ 12 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఐదుగురు నేతల మధ్యే ఉన్నట్లు కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా టికెట్ రేసులో మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల యుగంధర్, మల్లు నందిని, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ టికెట్ వేటలో పోటీపడుతున్నారు.
Huge Demand for Khammam Congress MP Ticket : ముగ్గురు మంత్రుల కుటుంబీకులు అభ్యర్థిత్వం ఆశిస్తుండటంతో ఎంపికలో పీఠముడి తప్పేలా లేదు. లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచి రాజకీయ అరంగేట్రం చేయాలని పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మలయుగంధర్, మల్లు నందిని ఉవ్విళ్లూరుతున్నారు. భారీ కాన్వాయ్‌తో ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మల్లు నందిని గాంధీభవన్‌కు వెళ్లి సత్తా చాటారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో పొంగులేటికి అన్నీ తానై బాధ్యతలు నిర్వర్తించిన ప్రసాద్ రెడ్డి ఎంపీ బరిలో నిలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఖమ్మంలో తుమ్మల ప్రచారం, ఎన్నికల ఎత్తుగడ, గెలుపులో కీలక పాత్ర పోషించిన తుమ్మల యుగంధర్, ఈ సారి ఎలాగైనా ఎన్నికల క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొంటున్న యుగంధర్, తనకు అవకాశం ఇవ్వాలని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ఖమ్మం బరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసకక్తి రేపుతోంది.
బీజేపీకి బాబు మోహన్ గుడ్ బై - రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
కేసీఆర్ సర్కార్ అవినీతిని ఊరూరా చాటి చెప్పండి - పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు