High Tension In Huzurabad : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు రావాలని సవాల్ విసురుకున్న నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వీణవంకకు చేరుకున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.
Ponnam Vs Kaushik Reddy : నిబంధనలకు విరుద్దంగా రవాణా అవుతున్న బూడిద పంచాయితీ కాస్తా దేవుని వద్ద ప్రమాణాలకు దారితీయడం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య జరుగుతున్న యాష్ సప్లై వ్యవహారం రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వందల కోట్ల స్కాం అంటూ ఆయన ఏకంగా బూడిద రవాణా చేసే లారీలను అడ్డుకున్నారని ఆరోపణలకు దిగారు.
మంత్రి పొన్నం లీగల్ నోటీసులు : ఈ వ్యవహారంపై ఆగ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ పత్రికతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి మీడియా ముందు సవాల్ విసిరారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని జూబ్లీహిల్స్ వెంకటవేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తారా? అని పొన్నం ప్రభాకర్‌కు ఛాలెంజ్ చేశారు. మంత్రి పొన్నంపై ప్రభాకర్ పై కౌశిక్ రెడ్డి విసిరిన ఈ సవాల్‌పై హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వొడితెల ప్రణవ్ కౌంటర్ అటాక్ చేశారు.
కౌశిక్ రెడ్డి అవినీతికి పాల్పడకపోతే చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని ప్రతి సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన కౌశిక్ రెడ్డి చెల్పూరు హనుమాన్ గుడికి వస్తుండగా పోలీసులు నిర్బంధించారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని నిరూపించాలని మంత్రి పొన్నం సవాల్ విసిరారని, నిరూపణకు వస్తుంటే గృహనిర్బంధం చేశారని మండిపడ్డారు.
"మీ సవాల్ స్వీకరించి నా నిజాయితీ నిరూపణకు ప్రమాణం చేస్తున్నా. నేను ఎక్కడా అవినీతి చేయలేదు.. అవసరం కూడా లేదు. నా సవాల్‌ను స్వీకరించి మంత్రి పొన్నం నిజాయితీ నిరూపించుకోవాలి. రేపు అపోలో వెంకటేశ్వరస్వామి గుడికి వచ్చి నిజాయితీ నిరూపించుకోవాలి. నిజాయితీ నిరూపణకు రాకపోతే అవినీతి చేసినట్లు పొన్నం ఒప్పుకున్నట్లే." అని కౌశిక్ రెడ్డి అన్నారు.
మరోవైపు ఒక బాధితుడు తన వద్ద రూ.20 లక్షలు తీసుకున్న పాడి కౌశిక్ రెడ్డి కోర్టులో ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ తాను చెప్పింది అక్షరాలా నిజమేనంటూ తడి బట్టలతో ప్రమాణం చేశారు. ఈ క్రమంలో హనుమాన్ ఆలయం వద్ద కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని, అధికార పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు.
నిరసనలు, అరెస్టులు, గృహనిర్భంధంతో కరీంనగర్లో ఉద్రిక్తత
పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత - ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం