Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కీలక ఊరట లభించింది. బ్యాలెట్ పేపరులో మార్పులు చేయాలంటూ ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. చేవేళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకే పేరుతో ఇద్దరు నామినేషన్ వేసినందున ఒక్కో పేరు మధ్య కనీసం 10 నెంబర్ల వ్యత్యాసం ఉంచుతూ బ్యాలెట్ పేపరులో మార్పు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ కొండా విశ్వేశ్వర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె. అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పిటిషనర్‌తో పాటు 46 మంది నామినేషన్ దాఖలు చేశారని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది కె.వి.భానుప్రసాద్, న్యాయవాది కె.విజయభాస్కర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ పేరుతో ఉన్న మరో వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేశారన్నారు.
జాబితాలో సీరియల్ నెంబరు 2గా పిటిషనర్ పేరు ఉందని, అయిదో పేరుగా మరో వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తండ్రి కాంతారెడ్డి అని ఉందన్నారు. పిటిషనర్ ప్రచారానికి వెళుతుంటే 5వ నెంబరు అభ్యర్థా అని అడుగుతున్నారన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు రెండు ఒకేచోట ఉన్నట్లయితే ఓటర్లు అయోమయంలో పడతారన్నారు. తమ పేర్ల మధ్య కనీసం 10 నెంబర్లు వ్యత్యాసం ఉండేలా బ్యాలెట్ పేపరులో మార్పులు చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
దీనికి సంబంధించి గత నెల 30న ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించామన్నారు. వినతి పత్రంపై నిర్ణయం తీసుకునే దాకా సీరియల్ నెంబర్లు కేటాయించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం బ్యాలెట్ పేపర్లో మార్పులు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ సమర్పించిన వినతి పత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచిస్తూ, పిటిషన్‌పై విచారణను మూసివేసింది.
చేవెళ్ల లోక్‌సభలో త్రిముఖ పోరు - మరి నెగ్గేదెవరో! - CHEVELLA LOK SABHA ELECTION 2024