Huge Traffic at Rachakonda Commissionerate Areas : నగరంలో ఇప్పటికే ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు సతమతమవుతున్న వేళ రోడ్లను సగం మేర ఆక్రమించి వ్యాపారులు, ప్రధాన కూడళ్ల దగ్గర అడ్డగోలుగా నిలిపేస్తున్న వాహనాలతో రాచకొండ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. దీనిని పరిష్కారించాల్సిన ట్రాఫిక్ విభాగం ప్రేక్షక పాత్ర పోషిస్తుండడంతో సమస్య తీవ్రత ఇంకా పెరుగతోంది. కొన్ని ప్రధాన కూడళ్లల్లోనూ ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోకుండా కేవలం చలానాలకు పరిమితమవడం తీవ్ర విమర్శలకు దారీ తీస్తోంది.
ప్రధాన ప్రాంతాల్లో పర్యవేక్షణలేమి
- పైవంతెన, అండపాస్లతో ఎల్బీనగర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేక సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా మారింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితి మెరుగ్గా ఉండాలి. కానీ ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షణలేమితో ఆటోలు, ఇతర వాహనాదారులు ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. బస్సులు సైతం స్టాపుల వద్ద నిలపకపోవడంతో గందరగోళంగా మారుతోంది.
- ఉప్పల్ కూడలిలోనూ వరంగల్ వెళ్లే వెహికల్స్, ఆర్టీసీ బస్సులు అడ్డగోలుగా నిలపడంతో రద్దీ ఏర్పడుతోంది. వరంగల్ నేషనల్ హైవేలో ప్రవేశించగానే ఇరుకు రోడ్డు ట్రాఫిక్ స్తంభించిపోతుంది.
- హబ్సిగూడ చౌరస్తా నుంచి ఉప్పల్ వరకు సాయంత్రం వేళ ప్రయాణించే వాహనదారులకు విసుగుపుట్టిస్తోంది.
- చైతన్యపురి- రంగారెడ్డి కోర్టు వరకు ప్రధాన రహదారిని కొందరు పండ్ల వ్యాపారులు సగం మేర ఆక్రమిస్తున్నారు.
- నాగోల్, ఉప్పల్ మెట్రోస్టేషన్ల కంటే ముందు వచ్చే యూటర్న్‌ల వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటోంది.
అప్‌డేట్స్‌లో రాచకొండ పోలీసులు వెనకడుగు : విజయవాడ హైవే, ఎల్బీనగర్- హబ్సిగూడ వరకు ఇన్నర్ రింగురోడ్డు, సాగర్ రహదారి వంటి కీలకమైన మార్గాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. రద్దీ సమయాలు, వర్షాలు ఇతర ప్రత్యేక సందర్భాల్లో సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తాజా సమాచారం ఇస్తున్నాయి. కానీ రాచకొండ పోలీసులు మాత్రం ఈ తాజా సమాచారం ఇవ్వడంతో కొంత వెనుకబడ్డారు.