Attack on TDP Central Office Case Updates: మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైఎస్సార్సీపీ మూకల దాడి వెనక ఆ పార్టీ నేతల పాత్ర ఉందని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టుకు నివేదించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, దేవినేని అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. ఉద్దేశ పూర్వకంగా పక్కా ప్రణాళికతోనే కార్యాలయంపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారని లూథ్రా వాదనలు వినిపించారు.
ముగ్గురు నిందింతులు బయట కారులో కూర్చొని ధ్వంస ఘటనను పర్యవేక్షించారని కోర్టుకు తెలిపారు. వాళ్లు బినామీ కార్లు వినియోగించారని, దానికి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నాటి దర్యాప్తు అధికారి ఈ కేసు పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించే కనీస ప్రయత్నం చేయలేదన్నారు. దర్యాప్తులో జాప్యం చేసినందుకు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఆయన కోర్టుకు విన్నవించారు.
ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ కార్యాలయంపై దాడి- అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా
ఘటన రోజున నిందితులు ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు, మొబైల్ లొకేషన్ వివరాలు సర్వీసు ప్రొవైడర్ల నుంచి సేకరించాల్సి ఉందన్నారు. నిందితులు వినియోగించిన వాహన యజమానులను ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నిస్తే వారు అందుబాటులో లేరని లూథ్రా వివరించారు. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ ఈ నెల14కు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ ఉత్తర్వులు ఇచ్చారు.
కాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే 4 బృందాల్ని రంగంలోకి దించి నిందితుల్ని అరెస్టు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో ఆరోజు దాడికి పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధారించారు. ఇది పసిగట్టిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా మరికొందరు వైఎస్సార్సీపీ కీలక నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.