Harish Rao React on Minister Komati Reddy Comments : అమెరికా వెళ్లి తాను విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావును కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని, నిరూపించకపోతే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. తనపై కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రికి మతి భ్రమించిందని, ఆయన డాక్టర్‌కు చూపించుకోవడం మంచిదని హితవు పలికారు.
Harish Rao Challenge to Minister Komati Reddy : ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పడానికి కోమటిరెడ్డి ఆరోపణ ఒక ఉదాహరణ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తాను కుటుంబసభ్యులతో విదేశాలకు వెళ్లింది నిజమేనని, అయితే అమెరికా వెళ్లినట్లు, ప్రభాకర్ రావును కలిసినట్టు మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారని ఆక్షేపించారు. ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్‌లో ఉన్నాను తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పాస్‌పోర్ట్ సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తానని, అందులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనమని ఎద్దేవా చేశారు.
Harish Rao Fire on Komati Reddy : కోమటిరెడ్డి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో చర్చకు రావాలని హరీశ్‌రావు తెలిపారు. ఆధారాలతో రాని పక్షంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి చెప్పిన తేదీ, సమయానికి అమరవీరుల స్థూపం వద్దకు తాను వస్తానని, మంత్రి కూడా ఆధారాలతో రావాలని సూచించారు. టీవీల్లో బ్రేకింగ్స్, స్క్రోలింగ్‌ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని, పాలనపై దృష్టి సారించాలని సూచించారు. నిరాధార నిందలు వేసి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలని పేర్కొన్నారు.