Graduate MLC Campaign in Telangana : వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ప్రచారం ఉద్ధృతమైంది. 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనడం సరికాదని విమర్శించారు. భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న అనిల్‌కుమార్ నిత్యం సమస్యలపై పోరాడే తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఖమ్మంలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పట్టభద్రులంతా మద్దతు పలకాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి ఓటేయాలని అభ్యర్థించారు.
BRS Election Campaign in BY Election : కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్న బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక్కరికైనా పింఛన్ పెరిగిందా అని ప్రశ్నించారు. కొత్తగూడెం, ఇల్లందులో ఎమ్మెల్సీ ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ పాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. పదేళ్లలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని కొలువులు ఇవ్వలేదని గుర్తు చేశారు.
Etela Rajender Election Campaign in Suryapet : అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్, ఖమ్మంలో నిర్వహించిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఈటల పాల్గొన్నారు. సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ కుంటుపడిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కి రాష్ట్రంలో మనుగడలేదన్నారు. సమస్యలపై పోరాటం చేసే పార్టీ బీజేపీనేనని, ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
"అధికార పార్టీ మమ్మల్ని మోసం చేస్తోందని మాకు దరఖాస్తులు వస్తున్నాయి. మహాలక్ష్మి పథకం నిధులు ఎప్పటికప్పుడు చెల్లించాలి. నిరుద్యోగులను, ఉద్యోగులను ఓట్లు అడిగే ముందు వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను." - ఈటల రాజేందర్, బీజేపీ నేత