Gadwal MLA Bandla Krishna Mohan Reddy Meet CM Revanth Reddy : గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కృష్ణ మోహన్‌రెడ్డి, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను కలవడం, తిరిగి బీఆర్ఎస్లోకి వెళుతున్నట్లు వెల్లడించడంతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది. అధికార పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ మారుతుండటంతో ఆ ప్రభావం ఇతర ఎమ్మెల్యేలపై పడే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. దీంతో పీసీసీ నాయకత్వం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించింది.
మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా విందు, రాజకీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కూడా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో గురువారం ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. చర్చలు సఫలం కావడంతో ఇవాళ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కృష్ణ మోహన్‌రెడ్డి కలిశారు. బీఆర్ఎస్లోకి గద్వాల ఎమ్మెల్యే వెళుతున్నారన్న ప్రచారం జరిగిన సందర్భంగా సీఎం రేవంత్‌ను కృష్ణ మోహన్‌రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి.
అసలేం జరిగిందంటే? : జులై 6వ తేదీన గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరికపై గద్వాల కాంగ్రెస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. గద్వాల మాజీ జడ్పీ ఛైర్పర్సన్ సరితా తిరుపతయ్య, ఆమె అనుచరులకు ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడం ఇష్టం లేదు. ఆయన చేతిలోనే సరిత ఓటమి చవిచూశారు. వారితో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మంతనాలు జరిపి సర్ది చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ కూడా గద్వాల కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించి సర్ది చెప్పారు.
ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి కలిసి ఉండటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సోపాల మీద కూర్చుని నవ్వుతూ కనిపించారు. ఈ క్రమంలో ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గద్వాల కాంగ్రెస్ నేతలు తనను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే బహిరంగంగానే చెప్పారు. దీంతో అప్రమత్తం అయిన కాంగ్రెస్ అధిష్ఠానం, ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డితో మంతనాలు జరిపింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.