TDP Super Six Free bus For Women : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆడపిల్లలు, మహిళల కళ్లలో ఆనందం చూడాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆలోచన చేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం హామీకి ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో మహిళల పాలిట వరంలా మారిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు భారీ ఎత్తున ఉపయోగించుకుంటున్నారు.
TDP Manifesto 2024 : ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల ఆర్థికంగా తమకు వెసులుబాటు కలిగిందని మహిళా ప్రయాణికులు తెలిపారు. విద్యార్థినులు తమ రోజూవారీ బస్సు చార్జీలు లేకపోవడం వల్ల తాము ఆ డబ్బులను పుస్తకాలు, నోట్ బుక్స్ కొనుగోలు చేయడానికి, స్టేషనరికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి వినియోగిస్తున్నామని పేర్కొంటున్నారు. బస్సు చార్జీల డబ్బులను రోజువారీ ఇతరత్ర ఖర్చులకు వినియోగించుకుంటున్నామని కొంతమంది విద్యార్థులు తెలిపారు. ఇక గృహిణులు సైతం ఉచిత బస్సు ప్రయాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజూ బస్సు చార్జీలు మిగలడం వల్ల వాటిని నిత్యం వినియోగించే కూరగాయలు, పాలు, పండ్లు, ఉప్పులు, పప్పులు తదితర నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. మొత్తానికి బస్సులు చార్జీల మిగులు తమ కుటుంబానికి కొంత ఆర్థిక భారాన్ని తగ్గించాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో నాలుగు నెలల్లో 40కోట్ల జీరో టికెట్లు జారీచేశారు. ప్రస్తుతం ప్రతినిత్యం 29లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు.
TDP JANASENA BJP MANIFESTO : రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు ఇప్పటికే మూడుసార్లు పెంచేసిన జగన్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తోంది. బస్ పాస్ చార్జీలు చెల్లించలేక ఎంతో మంది విద్యార్థినులు పైచదువులకు దూరమయ్యారు. రోజు వారీ ప్రయాణాలు చేసే చిరుద్యోగులు వేతనంలో అధిక మొత్తాన్ని ఆర్టీసీ చార్జీలకే చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థినులు, మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలుంది.
తెలంగాణలో ఉచిత బస్సు పథకం లక్షలాది మహిళల దైనందిన జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకాన్ని 40 కోట్ల మంది వినియోగించుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటున్నారు. పైసా ఖర్చు లేకుండా రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఆదా అవుతున్న డబ్బును ఇతర అవసరాలను వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో, గ్రేటర్ హైదరాబాద్ లోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని టీఎస్ ఆర్టీసీ అమలు చేస్తోంది.