Malla Reddy on Congress and BJP : శుక్రవారం ఓ శుభ కార్యక్రమంలో ఈటల రాజేందర్‌ను కలిసినప్పుడు మామూలుగా ఆల్ ది బెస్ట్ చెప్పానని, దానికే రాద్ధాంతం చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మండిపడ్డారు. పగవాడిని కూడా ఫ్రెండ్లీగా చూసే తత్వం తనదని, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలకు అంతా తెలుసన్నారు. మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ చేయని అభివృద్ధిని కేసీఆర్ ఆశీర్వాదంతో తాను చేశారని పేర్కొన్నారు.
ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రాగాడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని టెట్రో ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అంటే మోసమని, నగదు ఇచ్చే పథకాలను అమలు చేయడం లేదని మల్లారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు వాళ్లు వాళ్లే కొట్లాడుకోవడానికే సరిపోతుందుని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని విమర్శించారు.
బీజేపీకి దమ్ములేదని, రాముడి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పాలమ్మిన, పూలమ్మిన అనే డైలాగ్ చెబితే ప్రపంచమే నివ్వెర పోయిందని, సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించిందన్నారు. మల్లన్న తుమ్మితే తుపాన్ వస్తుందన్నారు.
BRS MP candidate Ragidi Laxma Reddy on Congress : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, తన మహబూబ్‌నగర్ జిల్లాకు రూ.3500 కోట్లు మంజూరు చేసుకున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు. తనను గెలిపిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ నేతలు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధానంతో ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీలలో రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇప్పటివరకు ఎవరకీ ఇవ్వలేదని తెలిపారు.
'తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌ది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రానికి చేసేందేమీ లేదు. రెండు పార్టీలు ఒక్కటే. దేశ ప్రజలను మొత్తం మోసం చేశారు. ఓటు అడిగే హక్కు బీజేపీ, కాంగ్రెస్‌కు లేదు. ఓ శుభ కార్యక్రంలో ఈటల రాజేందర్ కలిస్తే మాట్లాడా. అ సందర్భంలో ఆల్ ది బెస్ట్ చెప్పా, గెలుస్తావు అని చెప్పా. తప్పా అది. అభివృద్ధి చేస్తేనే గెలుస్తారు'-మల్లారెడ్డి, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే
అన్నా నువ్వే గెలుస్తావ్ - ఈటలతో మల్లారెడ్డి సరదా మాటలు - Malla Reddy Meets Etela Rajender