YSRCP Leader Pendem Dorababu Resign : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అవకాశాల కోసం తాను పార్టీ మారడం లేదని, అభివృద్ధి ప్రజల ఆకాంక్షల కోసమే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. నియోజకవర్గంలో పెత్తనం కోసం తాను పార్టీ మారడం లేదని తెలిపారు.
వైఎస్సార్సీపీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కూటమితో కలిసి పని చేస్తానన్న దొరబాబు.. తాను త్వరలో ఏ పార్టీలో చేరతాననేది తెలియజేస్తానన్నారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక ప్రజలు కార్యకర్తలు నాయకులతో తనకు అనుబంధం ఉందని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేశానని, పార్టీ కోసం పని చేయడం తప్ప వెన్నుపోటు రాజకీయం తనకు తెలియదని దొరబాబు స్పష్టం చేశారు.
తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని, పిఠాపురం ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ సమన్వయం చేసుకుంటానన్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు త్వరలో తన అభిప్రాయం తెలియజేస్తానని వెల్లడించారు.
ప్రజలు నియోజకవర్గ అభివృద్ధిని కోరుకుంటున్నందునే తాను పార్టీకి రాజీనామా చేసి కూటమి వైపు చూస్తున్నానని దొరబాబు స్పష్టం చేశారు. అంతే తప్ప రాజకీయం చేయడం, నియోజకవర్గంలో పెత్తనం చేయడం కోసం పార్టీ మారడం లేదని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి జనసేన పార్టీ అవకాశం ఇచ్చిందని గుర్తు చేస్తూ తనకు పిఠాపురమే ముఖ్యం కాబట్టి ప్రజల వైపే ఉన్నానని వివరించారు. అందుకే జనసేన అవకాశం ఇచ్చినా అటువైపు చూడలేదని చెప్పారు. కూటమి అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందని దొరబాబు తెలిపారు.
ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోతోంది - వైఎస్సార్సీపీ నుంచి జారుకుంటున్న నేతలు! - YSRCP Leaders Migration in AP
వైఎస్సార్సీపీకి షాక్- పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే