Parliament Elections Nominations 1st Day in Telangana : రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు పలువురు బీజేపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నేతలు ఆలయాల్లో పూజలు నిర్వహించి, పార్టీ నేతల సమక్షంలో ఎన్నికల అధికారులకు నామపత్రాలు సమర్పించారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ మేడ్చల్ కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఉదయం శామీర్‌పేట్‌లోని తన నివాసంలో కేంద్రమంత్రులు హర్‌దీప్‌సింగ్ పూరి, కిషన్ రెడ్డితో కలిసి సభ ఏర్పాటు చేసిన ఈటల, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాజేందర్, ఆయన సతీమణి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నట్లు ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.
BJP Candidate DK Aruna Nomination : మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పట్టణంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామపత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి రవి నాయక్‌కు డీకే అరుణ నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం లక్ష్మణ్‌తో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు నెలలకే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్, తనను ఓడించేందుకు కుట్రలు చేస్తోందని అరుణ ఆరోపించారు.
Nagar Kurnool MP candidates Nomination : మెదక్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి మెదక్ కలెక్టరేట్ వద్దకు వెళ్లిన ఆయన, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ధన బలానికి, జన బలానికి మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు తనకు అండగా నిలవాలని కోరారు. నాగర్ కర్నూల్‌లో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి తరఫున వారి ప్రతిపాదకులు నామినేషన్ వేయగా, మహబూబ్‌నగర్‌లో ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. మెదక్‌లో 4 నామినేషన్లు దాఖలు కాగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరఫున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నామపత్రాలు దాఖలు చేశారు. అదే విధంగా మరో ఇద్దరు స్వతంత్రులు నామినేషన్ వేశారు.
జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తరఫున, నల్గొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున వారి ప్రతిపాదకులు తొలి రోజు నామినేషన్ వేశారు. చేవెళ్లలో మూడు నామినేషన్లు, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి ఇద్దరు స్వతంత్రులు నామపత్రాలు సమర్పించారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి మూడు, మహబూబాబాద్ స్థానానికి ఒక నామినేషన్ దాఖలైంది. మొత్తంగా తొలిరోజు 42 మంది అభ్యర్థుల నుంచి 48 నామినేషన్లు దాఖలయ్యాయి.