Actor Ali Resigned from YSRCP : ప్రముఖ సినీ నటుడు అలీ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం అలీ తాజాగా రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు వీడియో సందేశం ద్వారా ప్రకటించారు. ఇకపై తాను సామాన్యుడిగానే ఉంటానని, తన సినిమాలు, తన షూటింగ్‌లు చూసుకుంటానని తెలిపారు.
20 ఏళ్లు టీడీపీలో ఉన్నానని, ఆ తర్వాత పార్టీ మారానంటూ వైఎస్సార్సీపీ పేరును వీడియో సందేశంలో అలీ ప్రస్తావించలేదు. 40 ఏళ్లు సినీ పరిశ్రమలో ఉన్నానని తన సేవా కార్యక్రమాలకు రాజకీయం తోడైతే పది మందికి మేలు జరుగుతుందని ఇటువైపు వచ్చానని అన్నారు. తాను రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. సంపాదనలో 20 శాతం మొత్తాన్ని తన ట్రస్టు ద్వారా సేవకు వినియోగిస్తున్నానని అలీ పేర్కొన్నారు.
ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఎవరినీ ఏ వేదికపై నుంచి విమర్శించలేదని అలీ స్పష్టం చేశారు. నేటి నుంచి తాను ఏ పార్టీ మనిషిని కాదని, ఏ పార్టీ మద్దతుదారున్ని కాదని అన్నారు. ప్రత ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓ సామాన్యునిగా ఓటు వేసి వస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే ఇకపై రాజకీయాలకు గుడ్‌బై అని అలీ అన్నారు.