ACB on Ex Mining Director Venkata Reddy Irregularities : ఇసుక కుంభకోణం కేసులో అరెస్టైన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని మూడు రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు సుమారు 60 ప్రశ్నలు సంధించారు. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలకు వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ధి కలిగించడం వెనుకున్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు అనేక అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ కుంభకోణంలో 2600కోట్ల మేర దోచుకున్నట్టు ప్రాథమికంగా తేల్చిన ఏసీబీ దీనికి మూలం ఎక్కడుంది, సూత్రధారులెవరు అనే దానిపై ప్రధానంగా వెంకటరెడ్డిని ప్రశ్నించింది.
ముగిసిన మూడు రోజుల కస్టడీ : ఎవరి ఆదేశాల మేరకు గత ఐదేళ్లలో ఇసుక అక్రమాలకు పాల్పడ్డారో కూపీ లాగేందుకు ఏసీబీ ప్రయత్నించింది. వెంకటరెడ్డి మాత్రం మూడు రోజులు పూర్తి స్థాయిలో విచారణకు సహకరించలేదు. ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు వ్యవహరించాననే చెప్పుకొచ్చారు. ఏసీబీ అడిగిన కొన్ని ప్రశ్నలకే సమాధానమిచ్చిన వెంకటరెడ్డి మరికొన్నింటిని దాటవేశారు. ఇంకొన్నింటికి నర్మగర్భంగా జవాబిచ్చారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ఆయన మూడు రోజుల కస్టడీ ముగియడంతో జ్యుడిషియల్ రిమాండ్ కోసం విజయవాడ జైల్లో అప్పగించేశారు. ఈ మూడు రోజుల విచారణలో వెల్లడించిన అంశాలు వాటి ఆధారంగా రూపొందించిన వాంగ్మూల పత్రాలపై ఆయన సంతకాలు ఏసీబీ అధికారులు తీసుకున్నారు.
ప్లీజ్ నన్ను ఏమి అడగొద్దు - వాళ్ల పేర్లు చెప్పలేను - ACB Inquiry on Venkata Reddy
మౌనం పాటించిన వెంకటరెడ్డి : జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా ప్రతినిధులు మరికొందరు వ్యక్తులతో కలిసి వెంకటరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని గుర్తించిన ఏసీబీ, దీన్ని తెరవెనక నడిపించిన ప్రధాన వ్యక్తులెవరో గుట్టు తేల్చే పనిలో ఉంది. వెంకటరెడ్డి నేరుగా ఎవరి పేర్లూ చెప్పనప్పటికీ ఏసీబీ అధికారులు తమ వద్దనున్న ఆధారాలతో కొందరు ఉన్నత స్థాయి వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ వారి ప్రమేయంపై వెంకటరెడ్డిని ప్రశ్నలడిగారు. కొన్నింటికి అవునని మరికొన్నింటికి కాదని ఆయన సమాధానమిచ్చారు. ఇంకొందరు కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించినప్పుడు మౌనంగా ఉన్నట్లు సమాచారం.
వారికి నోటీసులు : ఇసుక కుంభకోణంలో వెంకటరెడ్డి సమాధానాలతో గత ప్రభుత్వంలోని కీలక స్థానాల్లోని వ్యక్తుల ప్రమేయం ఎక్కడ ఎలా ఉందో ఏసీబీ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. మరిన్ని ఆధారాలు సేకరించి వారిని నిందితులుగా చేర్చనున్నారు. వారికి కూడా నోటీసులిచ్చి విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.