Ex CM KCR Election Campaign in Ramagundam : బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించిందదని తెలిపారు. కేంద్రంలో ఈసారి రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని కేసీఆర్ జోస్యం చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జరిగిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ రూ.84 ఉండేదని పేర్కొన్నారు. కానీ ఈ పదేళ్ల మోదీ హయాంలో రూపాయి విలువ చాలా దిగజారిపోయిందని ఆవేదన చెందారు. మోదీ హయాంలో దేశం నాశనం అవుతుందని పేర్కొన్నారు. మోదీ పాలనలో మత విద్వేషం, దేశం నాశనం తప్ప ఏం లేదని విమర్శించారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని అన్నారు.
కాంగ్రెస్ చాలా అధికారంలో ఉండదు : ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ వచ్చిందానని ప్రశ్నించారు. రూ.200 ఉన్న పింఛన్‌ను బీఆర్ఎస్ వచ్చి రూ.2 వేలు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ చాలా కాలం ఉండదని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 48 గంటల ఎన్నికల ప్రచార నిషేధం తర్వాత ఈ బస్సు యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
"ఈరోజు కేసీఆర్ బస్సు యాత్రలు ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్, బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయి. దీన్ని ఎలా అయినా ఆపించాలని చెప్పి కుట్ర పన్ని 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించారు. ఈరోజు ఇక్కడికి నేను రెండు గంటల ముందే వచ్చిన ఎన్నికల నిబంధన ఉండటంతో 8 గంటల తర్వాత వచ్చాను. ఇంకొక విషయం రాజకీయాలలో మతం గురించి మాట్లాడటం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేవుడు బొమ్మ పట్టుకుని ప్రతి సభలో మాట్లాడుతున్నారు. అది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి కనిపించదు." -కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత