Etela Rajender On Congress : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీని ముట్టుకుంటారా? అని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేదన్నారు. ప్రధాని మోదీని పెద్దన్న అన్న సీఎం రేవంత్ రెడ్డి, వెంటనే మళ్లీ మోదీ ఏంటీ అని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.
రుణమాఫీ హామీ ఇంకా నెరవేరలేదు : ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకింత మెజార్టీ వచ్చి, అరుదైన అవకాశం వస్తుందని కాంగ్రెస్ నాయకులు అనుకోలేదని తెలిపారు. అనాడు కేసీఆర్, ఈనాడు రేవంత్ రెడ్డి కూడా ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీని వెంటనే చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ ఇప్పటికీ రాలేదని ధ్వజమెత్తారు.
Etela Rajender On Phone Tapping Case : మహాలక్ష్మీ పేరిట నగదు సాయం అమలు కావడం లేదన్న ఈటల, రైతు భరోసా, కౌలు రైతులకు సాయం రైతులకు బోనస్ ఇస్తామన్నారు కానీ, ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. కడియం శ్రీహరిని దళితుడు కాదన్న రేవంత్ రెడ్డి, మళ్లీ అతని కుమార్తెకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని తానేనని స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని సంసారాలు కూడా ఫోన్ ట్యాపింగులతో పాడయ్యాయని వివరించారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర చర్చ జరగాలన్నారు.
ఎన్నికల్లో గెలుపు బీజేపీదే : రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారు వెంటనే అనర్హులవుతారని చెప్పిన కాంగ్రెస్, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా తీసుకుందని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి రాలేని కాంగ్రెస్, హామీలు ఎలా అమలు చేస్తుందన్న ఈటల, రాష్ట్ర ప్రజలను వంచించడానికే గ్యారెంటీలు ప్రకటించిందని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాల సూచనలను ప్రభుత్వాలు పాటించాలి. కేసీఆర్‌లా రేవంత్ కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ ఇప్పటి వరకు కాలేదు. కేసీఆర్ ప్రకటించిన రూ.లక్ష మాఫీ ఇప్పటికీ రాలేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. తెలంగాణలో 17 సీట్లు గెలిచినా, కాంగ్రెస్ 60 ఎంపీ స్థానాలకు మించదు. తెలంగాణలో 17 సీట్లు గెలిచి రాహుల్ పీఎం ఎలా అవుతారు? అధికారంలోకి రాలేని కాంగ్రెస్, హామీలు ఎలా అమలు చేస్తుంది. - ఈటల రాజేందర్, మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి
పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి - ఇప్పుడెలా చేర్చుకుంటున్నారు : ఈటల
అధిష్ఠానం ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా : ఈటల రాజేందర్