Special Observers For Election: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కొన్ని రాష్ట్రాలకు నియమించిన ప్రత్యేక ఎన్నికల అబ్జర్వర్లకు ప్లీనరీ అధికారాలు కల్పించింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన నిర్ణయాలు తీసుకోవటంతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో పరిస్థితుల్ని మెరుగుపర్చేందుకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఈసీ సూచనలు ఇచ్చింది. ఏపీ సహా 6 రాష్ట్రాలకు సాధారణ, పోలీసు పరిశీలకులను, ఏపీ సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకుల్ని నియమించినట్టు ఈసీ పేర్కోంది. మరోవైపు ఎన్నికల సాధారణ ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా ఇప్పటికే ఏపీకి చేరుకుని విధులు ప్రారంభించారు.
సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలకు సాధారణ, పోలీసు, ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది. ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకు ఎన్నికల ప్రత్యేక సాధారణ, పోలీసు పరిశీలకులను నియమించారు. అలాగే ఏపీ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారంతో పాటు ఎన్నికల్లో సమాన అవకాశాలు, వ్యయం తదితర అంశాలపై ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు పర్యవేక్షించి ఎప్పటికప్పుడు ఈసీకి నివేదించనున్నారు.
కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, కావ్య - Lok Sabha Elections 2024
ఏపీ సహా పశ్చిమ బెంగాల్, యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా రాష్ట్రాలకు ఎన్నికల సాధారణ, పోలీసు ప్రత్యేక పరిశీలకులను నియమించారు. ఎన్నికల విధుల్లో పాల్గోనే ఉద్యోగుల రాండమైజేషన్, భద్రతా దళాల వినియోగం, ఈవీఎం యంత్రాలు తదితర అంశాలపై ప్రత్యేక పరిశీలకుల దృష్టి పెట్టనున్నారు. ఏపీకి ఎన్నికల సాధారణ పత్యేక పరిశీలకునిగా విశ్రాంత ఐఎఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రాను నియమించారు. రామ్మోహన్ మిశ్రా ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారు. ఇక పోలీసు స్పెషల్ అబ్జర్వర్ గా విశ్రాంత ఐపీఎఎస్ అధికారి దీపక్ మిశ్రాను నియమించింది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, యూపీ, ఒడిశా రాష్ట్రాలకు ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులను నియమించింది ఈసీ. ఇక ఏపీకి ఎన్నికల వ్యయం ప్రత్యేక అబ్జర్వర్ గా విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ను నియమించారు.
రాష్ట్ర కేంద్రాల నుంచి జిల్లాలు, సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితికి అనుగుణంగా స్పెషల్ అబ్జర్వర్లు ఆదేశాలు జారీ చేయనున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు నియోగించిన అబ్జర్వర్ల నుంచీ సమాచారం తీసుకుని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా స్పెషల్ అబ్జర్వర్లకు ఈసీ సూచనలు ఇచ్చింది. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో ఈసీ నిర్వహించే అన్ని సమావేశాలకు హాజరు కావాల్సిందిగా స్పెషల్ అబ్జర్వర్లకు సూచనలు ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ప్రత్యేక అబ్జర్వర్లకు ప్లీనరీ అధికారాలను కూడా ఎన్నికల కమిషన్ దఖలు పర్చింది.