DK Aruna Press Meet in Mahabubnagar : దేశం కోసం, ధర్మ కోసం అంటూ ఏకపక్షంగా ఓటర్లు బీజేపీకి ఓటేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని తెలిపారు. మహబూబ్నగర్లో బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్లో జరిగిన ఎన్నికపై స్పందించారు.
లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు బీజేపీ కార్యకర్తలను చాలా మంది బెదిరించారని డీకే అరుణ ఆరోపించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదని , మోదీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే తనకు ఓటర్లు ఓటేశారని అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలు పేదలకు అందుతున్నాయని తెలిపారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో విజయం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారన్న డీకే అరుణ, మోదీ మళ్లీ ప్రధాని కావాలని పార్టీలకు అతీతంగా చాలా మంది ఓటేశారని డీకే అరుణ స్పష్టం చేశారు.
"మోదీ మళ్లీ ప్రధాని కావాలని పార్టీలకు అతీతంగా చాలా మంది ఓటేశారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ ఏకపక్షంగా బీజేపీకి ఓటేశారు. మోదీ అభివృద్ధి కార్యక్రమాలను చూసే నాకు ఓటేశారు. ఈసారి మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో విజయం మాదే. మా పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారు. మా కార్యకర్తలను చాలా మంది బెదిరించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలు పేదలకు అందుతున్నాయి." -డీకే అరుణ, మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి
రుణమాఫీ అమలు కాకుంటే ఆగస్టు సంక్షోభం తప్పదు : అన్ని పార్టీల కంటే బీజేపీనే ఎక్కువ సీట్లు గెలుస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. మోదీపై ప్రజల్లో మరింత సానుకూలత పెరిగిందన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా కేవలం మోదీకి ఉందని ప్రజలు నమ్మారని తెలిపారు. రుణమాఫీ అమలు కాకుంటే ఆగస్టులో సంక్షోభం తప్పదని లక్ష్మణ్ హెచ్చరించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
"మొత్తం దేశవ్యాప్తంగా నాలుగు ఫేజ్లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లలలో, ఎన్డీయే కూటమితో కలిసి 400 సీట్లను సాధిస్తుంది. ఈ నాలుగు ఫేజ్లలో భారతీయ జనతా పార్టీకే మెజార్టీ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉచితాలు, గ్యారంటీలు అంటూ మాయ చేసిన ప్రజలు నమ్మలేదు. ఈ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలి. అంటే అప్పుల మీద అప్పులు చేసి వాటిని కట్టడానికి సరిపోతుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్లో విలీనం అవుతుంది." - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ