DK Aruna Comments on CM Revanth Reddy : జూరాల నుంచి నీళ్లు తీసుకునేలా డిజైన్ మర్చి, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిస్తే, తాను ఎంపీగా గెలిచిన తర్వాత పాలమూరు-రంగారెడ్డికి తప్పకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఇవాళ మహబూబ్నగర్లో జరిగిన మహబూబ్నగర్ పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి, సర్వే కోసం జీవో తీసుకొచ్చానని, అలా ఆ పథకానికి బీజం వేసిందే తానని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి కోసం ఏనాడైనా పోరాటం చేశారా అని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. జూరాల నుంచి ప్రారంభం కావాల్సిన ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)డిజైన్ మర్చి శ్రీశైలం నుంచి తీసుకున్నారన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలి పదవికి, జాతీయహోదాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ప్రాంతం బిడ్డగా పార్లమెంట్లో పాలమూరు-రంగారెడ్డి కోసం ఎందుకు పోరాటం చేయలేదని ఎదురుదాడికి దిగారు.
రాహుల్ గాంధీ ప్రధాని కాలేరు : కొడంగల్ - నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా కేవలం లక్ష ఎకరాలకే సాగునీరు అందుతుందని, 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డిని రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదని డీకే అరుణ అన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని అయితేనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, రాహుల్ ప్రధాని అయ్యేది లేదని, ఆరు గ్యారంటీలు అమలయ్యేదీ లేదంటూ ఆరోపణలు గుప్పించారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే, ఆ ఓట్లు మురిగిపోయినట్లేనని అరుణ వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల కోసం తాను పని చేశానని, రేవంత్(CM Revanth)కు ఉమ్మడి జిల్లాకు ఏం చేశారో చెప్పాలన్నారు. చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా శాసనసభ ఎన్నికల్లో గెలిచారని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు.
'మహబూబ్నగర్ జిల్లా కోసం రేవంత్రెడ్డి ఎప్పుడైనా కృషి చేశారా? ప్రాజెక్టుల కోసం పోరాటం చేశారా?. నీళ్ల కోసం ఉద్యమం చేశారా?. అభివృద్ధి కోసమైనా పోరాటం చేశారా ?. మరే ఆయనకు ఓటు ఎందుకు వేయాలి. కేసీఆర్ను ఓడించాలని ఓట్లేశారు తప్ప, కాంగ్రెస్ను గెలిపించాలని ఓట్లేశారా?. వాళ్లు చేసిన రెండు మోసాలకే ఓట్లేశారు.'- డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఓటేయలేదు - డీకే అరుణ - Lok Sabha Election 2024