Discussion in Legislative Council on Sharada Peetham Lands : ప్రజావసరాల కోసం కాకుండా గురుదక్షిణ కోసం గత ప్రభుత్వం విలువైన భూముల్ని కారు చౌకగా శారదాపీఠానికి కేటాయించిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు. కేటాయింపులో అన్ని నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ఈ క్రమంలో శారదాపీఠానికి భూముల కేటాయింపులపై శాసన మండలిలో అధికార, విపక్ష పార్టీల మధ్య చర్చ వాడీవేడీగా జరిగింది. ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు.
విశాఖలో రూ.300 కోట్లు విలువజేసే భూమిని రూ.15 లక్షలకు శారదాపీఠానికి గత ప్రభుత్వం అప్పగించిందని తెలిపారు. మార్కెట్ విలువ వసూలు చేయాల్సి ఉండగా పాటించలేదని తెలిపారు. ఎకరా రూ.1.5 కోట్లు విలువ ఉండగా కేవలం రూ.1 లక్షకే శారదా పీఠానికి భూములను కేటాయించిందని అన్నారు. భూముల కేటాయింపులకు జీవీఎంసీ ఆమోదం పొందలేదని ఎన్వోసీ తీసుకోలేదని తెలిపారు. వేద పాఠశాల కోసం భూములు తీసుకుని వాణిజ్య అవసరాల కోసం అనుమతి కోరారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శారదా పీఠానికి అక్రమంగా ఇచ్చిన భూములు రద్దు చేసినట్లు తెలిపారు.
ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవచ్చు: నిబంధనలను పట్టించుకోకుండా గురువుకు గురు దక్షిణగా జగన్ ఇచ్చారని ఆరోపించారు. గురుదక్షిణగా ఇచ్చారన్న వ్యాఖ్యలపై మండలిలో వైఎస్సార్సీపీ నేత బొత్స అభ్యంతరం తెలిపారు. ధార్మిక సంస్థలకు భూముల కేటాయింపులు గత ప్రభుత్వాల నుంచి కొనసాగుతోందని, శారదా పీఠానికి నిబంధనలకు విరుద్దంగా భూముల కేటాయింపులు ఉంటే రద్దు చేయవచ్చన్నారు. శారదా పీఠానికి కేటాయించిన భూములు రద్దు చేస్తే తమక ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు గురుదక్షిణగా ఇచ్చారని ఆరోపనలు సరికాదన్నారు. కేటాయింపులో ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవచ్చని బొత్స అన్నారు . అయితే గురువుకిచ్చిన దాన్ని గురుదక్షిణే అంటారని మంత్రులు బదులిచ్చారు.