Digvijaya Singh Fires on PM Modi : నిరసన తెలిపేందుకు రైతులు దిల్లీకి రాకుండా చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అన్నదాతలకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయిందని వాపోయారు. ప్రధాని మోదీ కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా ఉన్నారని విమర్శించారు. అదానీ లాంటి వాళ్లకు మేలు జరిగే నిర్ణయాలే వారు తీసుకున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. దేశంలో పెరుగుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ యాత్ర చేస్తున్నారని చెప్పారు. రాహుల్ తన యాత్రలో ప్రధానంగా 5 సమస్యలు పరిశీలించారని పేర్కొన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకునే అవకాశం రైతులకు లేకుండా పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భూసేకరణలో అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేస్తోందని, భూసేకరణ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్ల పరిహారం ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
'మా డిమాండ్లన్నీ పాతవే'- కేంద్రంతో చర్చలకు రైతులు సై- కర్షకులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం
Congress Document 10 Sal Anyay kaal on Modi : మోదీ పదేళ్ల పాలనపై రూపొందించిన డాక్యుమెంట్‌ను దిగ్విజయ్ సింగ్ విడుదల చేశారు. దస్ సాల్, అన్యాయ్ కాల్ (10 Sal Anyay kaal) అనే పేరుతో దీనిని రూపొందించామని చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై ప్రధాని చేసిన అన్యాయాలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. పది సంవత్సరాల మోదీ కాలం కార్పోరేట్లకు కొమ్ముకాసిందని ఆరోపించారు. ఆయన చెప్పినట్టు ఇది అమృత్ కాల్ కాదని, దేశానికి వినాశ్ కాల్ అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
'మోదీ ప్రభుత్వానికి దాదాపు పదేళ్లు అయ్యాయి. ఆ పాలనపై మేము రిపోర్ట్ విడుదల చేస్తున్నాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై ప్రధాని చేసిన అన్యాయాలను డాక్యుమెంట్లో పొందుపరిచాం. దేశ రక్షణ విషయంలో మోదీ విఫలమయ్యారు. రక్షణ శాఖ మంత్రి ఒకటి చెప్తే ఆయన మరొకటి చెప్తారు. దేశంలో మోదీ ద్వేషాన్ని పెంచుతున్నారు. ప్రేమను పంచడానికి రాహుల్ యాత్ర చేస్తున్నారు. వసుదైక కుటుంబం మా ఆలోచన. భారత రాజ్యాంగ ఆలోచన కూడా అదే. కానీ బీజేపీ మాత్రం ప్రజలను విడగొడుతోందని' దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
పీవీ నరసింహారావు కాలంలోనే రామాలయం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రామ మందిరం అంశాన్ని రాజకీయం చేయొద్దని మొదటి నుంచి కాంగ్రెస్ ఆలోచించింది. సనాతన ధర్మం ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాతనే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. కానీ ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశంతో గుడి నిర్మాణం పూర్తి కాకముందే ప్రాణప్రతిష్ఠ చేశారు. సతీసమేతంగా కలిసి చేయాల్సిన పూజను మోదీ, మోహన్ భగవత్ ఒక్కొక్కరే కూర్చొని నిర్వహించి సనాతన ధర్మాన్ని కించపరిచారు. - దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత
బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు జరపాలని కాంగ్రెస్‌తో పాటు చాలామంది డిమాండ్ చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరగాలని చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని కాంగ్రెస్ మాట ఇస్తోందని హమీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మోదీ ప్రభుత్వం (Modi Government)అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అమ్మాయిలపై అత్యాచారాలను బీజేపీ సర్కార్ నిలవరించలేకపోయిందని దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు.
Digvijaya Singh Comments on BJP : స్వతంత్రం వచ్చిన తర్వాత మోదీ లాంటి దుర్మార్గ పాలన ఎప్పుడూ లేదని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం తమ మొదటి లక్ష్యమని చెప్పారు. మోదీ పాలనలో పేదవాళ్లు మరింత పేదవారిగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని విమర్శించారు. పీయూష్ గోయల్ వ్యవసాయ మంత్రి కాదని, కార్పొరేట్ కంపెనీల మంత్రి అని దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు.
'సర్జికల్ స్ట్రైక్స్ అంతా ఫేక్!'.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. భాజపా ఫైర్