Many Development Programs Start in Dharmaram : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పంటల బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపు సెట్లు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పీపుల్స్ మార్చ్ సందర్భంగా గతంలో ధర్మపురిలో పర్యటించాను. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిందని తెలిపారు. ప్రజల లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలుగా మార్చుకున్నామని అన్నారు. ప్రజా ఆకాంక్షలను చట్టాలుగా మార్చామని వివరించారు. 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేశామని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తాము రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ అంశంలో వెనకడుగు వేయమని తేల్చి చెప్పారు.
అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సాంకేతిక సమస్యలతో కొందరికి రుణమాఫీ కాలేదని అన్నారు. రూ.లక్ష రుణమాఫీ చేసేందుకు బీఆర్ఎస్ ఐదేళ్లు తీసుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే దఫాలో రూ.2 లక్షల రుణమాఫీ చేశామని హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘర్షణను కాంగ్రెస్‌కు అంటగడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పెద్దపల్లిలో 132 కేవీ సబ్‌స్టేషన్ : పెద్దపల్లి 132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్‌లో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని హామీ ఇచ్చార. విద్యుత్ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామని అన్నారు. ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చే ప్రభుత్వం తమదని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలుు వస్తాయని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్రంలో సరఫరా చేస్తున్నామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. లక్ష కూడా రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు. కానీ 9 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసిన మాపై విమర్శలు చేస్తారా అంటూ ప్రశ్నించారు.
"ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి పని చేస్తున్న ప్రభుత్వం తమది. మళ్లీ మీ అందరికి దగ్గరకు వచ్చాను. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదేళ్లు అయిన చేయని ఆనాటి ప్రభుత్వం, ఇప్పుడు 9 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే విమర్శలా?" - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం