Bhatti on Rs.500 Bonus for Paddy in Telangana : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో తెరిచిన వాటి కంటే ఈసారి 7,215 కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ప్రారంభించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం కంటే తామే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామన్న భట్టి, అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు గాంధీ భవన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం, భారత్ రాష్ట్ర సమితి నేతల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదని, తాము అలాంటి ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించి కొంటామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తామని, చివరి గింజ వరకు కొంటామని స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన అనంతరం మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్న ఆయన, అన్నదాతలెవరూ అధైర్యపడొద్దని, ధైర్యంగా, నిశ్చింతగా ఉండాలని కోరారు.
మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు - కేబినెట్ భేటీలో నిర్ణయం - Telangana Cabinet Meeting Decisions
మరోవైపు రూ.500 బోనస్ సన్న ధాన్యానికే అని విపక్షాలు విమర్శిస్తున్నాయన్న భట్టి విక్రమార్క, సన్న వడ్లకే రూ.500 బోనస్ అనలేదని అన్నారు. రూ.500 బోనస్ సన్న వడ్లతో మొదలు పెడుతున్నామని స్పష్టం చేశారు. రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదని, అన్నదాతల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరగడంతో అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆక్షేపించారు.
సన్న వడ్లకే రూ.500 బోనస్ అనలేదు. రూ.500 బోనస్ సన్న వడ్లతో మొదలు పెడుతున్నాం. ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు. అన్నదాతల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరగడంతో ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలకు ఇబ్బందులు రానివ్వదు. తడిచినా, మొలకెత్తినా చివరి గింజ వరకూ కొంటాం. - భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి
అదంతా రాజీవ్ గాంధీ చలవే : మరోవైపు భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా ప్రయత్నం చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దుష్టశక్తుల చేతిలో బలైపోయారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో టెక్నాలజీ కమ్యూనికేషన్ రంగాన్ని ముందు చూపుతో ప్రధానిగా రాజీవ్ గాంధీ ఆచరణలో పెట్టారని, యువతను రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి? ఎంత ధాన్యం కొనుగోలు చేశాం? ఇలాంటి సమాచారం క్షణాల్లో తెలుసుకుంటున్నామంటే కారణం రాజీవ్ గాంధీ చూపిన మార్గమేనన్నారు. ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని వివరించారు.