Budget Discussion On Civil Supplies : బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా పౌరసరఫరాల శాఖ అంశాలపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. 7వేల 500 కోట్ల లెక్కలు చెప్పాలన్నారు. బియ్యం టెండర్లలో 1100 కోట్ల కుంభకోణం జరిగిందని దానిపై సభాసంఘం వేసి విచారణ జరపాలని గంగుల డిమాండ్ చేశారు. సన్న బియ్యం కొనుగోళ్లే జరగలేదని కుంభకోణం అంటూ అబద్ధాలు చెబుతున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తోసిపుచ్చారు.
నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు : సభాసంఘం డిమాండ్‌పై స్పందించాలని బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఈ సమయంలోనే వ్యవసాయ శాఖ పద్దులను ఆమోదం కోసం ప్రవేశపెట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు మరో మంత్రి శ్రీధర్‌బాబు బీఆర్ఎస్ అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి పోయారు. వెల్‌లో కింద కూర్చొని నిరసనలు తెలిపారు. ఈ పరిణామంపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్లో అందరూ సీనియర్ సభ్యులు ఉన్నారని కొత్త సభ్యుడు కౌశిక్‌రెడ్డి ఏమో కానీ సీనియర్లు కూడా చప్పట్లు కొడితే ఎలా అని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
KTR On Sortex Rice : బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పద్దులకు సభ ఆమోదం పొందారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా పద్దులు ఆమోదం కోసం పెడుతున్న సందర్భంలో నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్కు సభాపతి అవకాశం ఇచ్చారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ సహా కొత్త కార్డులు ఇస్తామన్నందుకు సంతోషమన్న బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 1100 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన కేటీఆర్ ఇందుకు ఆధారాలు ఉన్నాయని, సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. తమకూ మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. అవకాశం రాకపోవడంతో బీజేపీ సభ్యులు కూడా వాకౌట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు లేకుండానే పద్దులు సభ ఆమోదం పొందాయి. పద్దులపై చర్చ పూర్తి కావడంతో అసెంబ్లీని సభాపతి ఇవాళ ఉదయం పది గంటలకు వాయిదా వేశారు.