Condolences to Sitaram Yechury: సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఏచూరి దేశ రాజకీయాల్లో గౌరవ స్థానం పొందారని గుర్తు చేశారు. పేద ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి అని కొనియాడారు. అట్టడుగువర్గాలతో సీతారాం ఏచూరికి మంచి అనుబంధం ఉందన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు, సహచరులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
Deeply saddened by veteran CPI-M leader, Sitaram Yechury Ji's passing. He was a stalwart who rose from the ranks to become one of the most respected voices in Indian politics. He was known for his intellectual take on issues, and connection with the people at the grassroots… pic.twitter.com/0vL9Jq6ao5
— N Chandrababu Naidu (@ncbn) September 12, 2024
వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి: వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి మరణం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సీతారామ్ ఏచూరి కోలుకొంటారని భావించానని పవన్ పేర్కొన్నారు. ఆయన మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా వామపక్ష భావజాలంతో మొదలైన రాజకీయ ప్రస్థానంలో తన ప్రతి అడుగు పేద ప్రజలు, బాధితులు, కార్మికుల పక్షాన వేశారని గుర్తుచేశారు.
ఎమర్జెన్సీ సమయంలో ప్రజల ప్రాథమిక హక్కుల కోసం బలంగా పోరాడుతూ అజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకువచ్చారని, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారాన్ని అందుకున్నారని కొనియాడారు. విదేశాంగ విధానంపై, ఆర్థికాంశాలపై, పారిశ్రామిక, వాణిజ్య విధానాలపై తన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ వ్యాసాలు రాశారని చెప్పారు. సీతారాం ఏచూరి మరణం పేద, కార్మిక వర్గాలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంటానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు.
వామపక్ష యోధుడు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారామ్ ఏచూరి గారి మరణ వార్త బాధాకరం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి - @PawanKalyan@cpimspeak @apcpim pic.twitter.com/2VsDMOo0eA
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 12, 2024
ప్రజా ఉద్యమాలకే జీవితం అంకితం: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీవ్ర విషాదం నింపిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని తెలిపారు. ప్రజా ఉద్యమాలకే జీవితం అంకితం చేసిన వారికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారి మృతి తీవ్ర విషాదం నింపింది. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయాం. ప్రజా ఉద్యమాలకే జీవితం అంకితం చేసిన వారికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి. pic.twitter.com/e8b8vtcwxT
— Lokesh Nara (@naralokesh) September 12, 2024
ప్రముఖ మార్క్సిస్టు దిగ్గజం, తెలుగువారైన సీతారాం ఏచూరి మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. భారతదేశంలో మార్క్సిస్టు భావజాల వ్యాప్తికి సీతారాం ఎంతో కృషి చేశారన్నారు. నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచిన సీతారాం ఏచూరి, తన తండ్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావుతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. గత ఏడాది జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో సీతారాం ఏచూరి పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. గొప్ప మేధావి, వక్త అయిన సీతారాం ఏచూరి రాజ్యసభలో చేసిన పలు ప్రసంగాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేవిగా ఉంటాయని కొనియాడారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాల్లో సీతారాం ఏచూరి కీలకపాత్ర పోషించారని తెలిపారు. వామపక్ష పార్టీల్లో కీలకనేతగా పేరు తెచ్చుకున్న సీతారాం ఏచూరి మరణం వామపక్షపార్టీల ఉద్యమాలకు తీరని లోటన్నారు. తుదిశ్వాస వరకు తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకే అంకితం చేసిన సీతారాం ఏచూరి మరణానికి తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంతాపం తెలియజేశారు. కమ్యూనిస్టు పార్టీలే కాకుండా అన్ని రాజకీయ పార్టీల అభిమానాన్ని పొందిన వ్యక్తి సీతారాం ఏచూరి అని తెలియజేశారు. ప్రజల తరఫున బలమైన గొంతుకగా పనిచేసిన సీతారాం ఏచూరి లేనిలోటు తీర్చలేనిదన్నారు.
స్టూడెంట్ లీడర్ నుంచి జాతీయ స్థాయి నేతగా- సీతారాం ఏచూరి ప్రస్థానం - Sitaram Yechury Biography
సీతారాం ఏచూరి కన్నుమూత- రాహుల్, మమత సంతాపం - Sitaram Yechury Passed Away