counting Agent : ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు చిట్టచివరి ప్రధాన అంశం. నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ పర్యవేక్షణ, నియోజకవర్గ అభ్యర్థి నియమించుకున్న ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. చట్టం ప్రకారం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టవచ్చు.
కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర
నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ప్రతినిధిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్ కీలక పాత్ర పోషిస్తారు. వారి సహకారంతో కౌంటింగ్ పర్యవేక్షకులు, కౌంటింగ్ సహాయకుల ముఖ్యమైన పనులు సులభతరం అవుతాయి.
EVM, VVPAT ద్వారా జరిగే పోలింగ్ విధానం, తాజా నియమాలపై ఏజెంట్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇందుకు గాను EVM, VVPAT పనిచేసే విధానంపై రిటర్నింగ్ అధికారి నిర్వహించే ప్రదర్శనకు తప్పనిసరిగా హాజరవ్వాలి.
కౌంటింగ్ ఏజెంట్ల అర్హత
కౌంటింగ్ ఏజెంట్లు నిర్దిష్ట అర్హత కలిగి ఉండాలని చట్టం ప్రకారం సూచించలేదు. అయినప్పటికీ, కౌంటింగ్ ఏజెంట్లను నియమించే క్రమంలో 18 సంవత్సరాలు నిండిన, కలుపుగోలుగా ఉంటూ, లెక్కలు తొందరగా, జాగ్రత్తగా వేయగలిగే వారికి ప్రాధాన్యతనిచ్చేలా పార్టీ అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధ తీసుకోగలరు.
కౌంటింగ్ ఏజెంటుగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, జిల్లా పరిషత్, నగర కార్పొరేషన్, మునిసిపల్, నగర పంచాయతీల చైర్మన్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కో-ఆపరేటివ్ సంస్థల చైర్ పర్సన్లు, ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది కలిగిన నాయకులను నియమించకూడదు.
కౌంటింగ్ ఏజెంట్ల నియామకం:
నియోజకవర్గ కౌంటింగ్ టేబుళ్లకు అనుగుణంగా పార్లమెంట్అ, సెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు వేర్వేరుగా ఏజెంట్లను తప్పనిసరిగా నియమించుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా ఒక రౌండ్ కౌంటింగ్‌కి 14 టేబుళ్లు, 1 టేబుల్ పోస్టల్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేస్తారు. పోస్టల్ ఓట్ల లెక్కింపు రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద జరుగుతుంది. రిటర్నింగ్ అధికారి టేబుల్ కు ఒక కౌంటింగ్ ఏజెంట్ తో కలిపి మొత్తం 15 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి. ఒకవేళ టేబుల్స్ పెంచితే, ముందుగానే RO/ARO తెలియజేస్తారు. నియోజకవర్గ అభ్యర్థి లేదా ప్రధాన ఎలక్షన్ ఏజెంట్ ద్వారా కౌంటింగ్ ఏజెంట్లు నియమితులవుతారు.
ఫారం-18 (Annexure 1) లో కౌంటింగ్ ఏజెంట్ పేరు, అడ్రస్ తదితర వివరాలు నింపి, నియోజకవర్గ అభ్యర్థి (లేదా) ప్రధాన ఎలక్షన్ ఏజెంట్ సంతకం చేసి, కౌంటింగ్ ఏజెంట్ సంతకం కూడా చేయించి (రెండు ఒరిజినల్ ఫారాలలో చేయించాలి.), కౌంటింగ్ కి 3 రోజుల ముందు ఒక ఒరిజినల్ కాపీని, కౌంటింగ్ ఏజెంట్ల 2 ఫోటోలతో సహా రిటర్నింగ్ అధికారికి అందజేయాలి.
మరొక ఒరిజినల్ కాపీని కౌంటింగ్ రోజున కౌంటింగ్ ఏజెంట్ సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాలి.
ఒక్క ఫారం-18 ని ఉపయోగించి కౌంటింగ్ ఏజెంట్లు అందరిని నియమించుకోవచ్చని గమనించగలరు. ఈ విషయంలో, అందరు కౌంటింగ్ ఏజెంట్లు అదే ఫారంలో సంతకం చేయవలసివుంటుంది.
ఈ నియామకాలను తప్పనిసరిగా కౌంటింగ్ తేదీకి 3 రోజులు ముందుగానే (అనగా 31.05.2024 సాయంత్రం 5 గంటలలోపు) రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని గమనించగలరు.
కౌంటింగ్ ఏజెంట్ల ఐడి కార్డులను ఒక రోజు ముందే రిటర్నింగ్ అధికారి నుండి నియోజకవర్గ పార్టీ అభ్యర్థి సేకరించి పెట్టుకోవాలి.
కౌంటింగ్ రోజున, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించబడిన వారు కౌంటింగ్ ప్రారంభం సమయానికి ఒక గంట ముందుగానే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని వారి ఐడి కార్డును మరియు నియామకపత్రాన్ని తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారికి చూపించినప్పుడే అనుమతించబడతారని గమనించగలరు. పైన పేర్కొన్న సమయం దాటితే రిటర్నింగ్. అధికారి కౌంటింగ్ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించరని గమనించగలరు.
కౌంటింగ్ ఏజెంట్ నియామకం రద్దు
ఏదైనా కారణంతో కౌంటింగ్ ఏజెంట్ నియామకాన్ని రద్దు చేయదలచుకుంటే, నియోజకవర్గ అభ్యర్థి (లేదా) ప్రధాన ఎలక్షన్ ఏజెంట్ కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఏ సమయంలోనైనా కౌంటింగ్ ఏజెంట్ నియామకాన్ని రద్దు చేయవచ్చు.
ఫారం-19 (Annexure IL) ద్వారా కౌంటింగ్ ఏజెంట్ నియామకాన్ని రద్దు చేయాలి.
రద్దు చేయబడిన వారి స్థానంలో వేరొకరిని కౌంటింగ్ ఏజెంట్ గా నియామకం చేయవచ్చు. కౌంటింగ్ ప్రారంభమయిన తరువాత నూతనంగా కౌంటింగ్ ఏజెంట్ల నియామకం చేసేందుకు వీలు ఉండరని గమనించగలరు.
పైన పేర్కొన్న విధంగా నూతన ఏజెంట్ నియామకం చేయవలసివుంటుంది.
కౌంటింగ్ హాలులోని ప్రతి వ్యక్తి చట్టప్రకారం ఓటింగ్ రహస్యాన్ని కాపాడాలి. రహస్య ఓటు నియమానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించిన యెడల శిక్షార్హులు అని గమనించగలరు.
కౌంటింగ్ హాలులో కౌంటింగ్ ఏజెంట్
కౌంటింగ్ కేంద్రం వద్ద గుర్తింపు కార్డు, నియామకపత్రాన్ని రిటర్నింగ్ అధికారికి చూపించిన తరువాత, రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ ఫారాన్ని కౌంటింగ్ ఏజెంటు ఇవ్వడం జరుగుతుంది. ఓటింగ్ రహస్యతకు కట్టుబడి ఉంటామని డిక్లరేషన్ ఫారంలో కౌంటింగ్ ఏజెంట్ సంతకం చేయాలి. 1) నియామక పత్రం, 2) ఐడీ కార్డు 3)డిక్లరేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి సరిచూసుకున్న తరువాత ఏజెంట్ ను కౌంటింగ్ హాలులోని అనుమతిస్తారు. కౌంటింగ్ ఏజెంట్లను చెక్ చేయించి కౌంటింగ్ హాలులోనికి అనుమతించే అధికారాన్ని రిటర్నింగ్ అధికారి కలిగిఉంటారు.
కౌంటింగ్ ఏజెంట్‌కు రిటర్నింగ్ అధికారి ఒక బ్యాడ్జ్ ఇస్తారు. ఏజెంట్ ఏ అభ్యర్థికి సంబంధించిన వారు, కౌంటింగ్ టేబుల్ క్రమ సంఖ్య వివరాలు బ్యాడ్జ్‌లో ఉంటాయి. అతనికి కేటాయించిన టేబుల్ వద్ద మాత్రమే ఏజెంట్ కూర్చోవలసివుంటుంది. కౌంటింగ్ హాల్ మొత్తం తిరగడానికి అనుమతించరు. నియోజకవర్గ అభ్యర్థి, ప్రధాన ఎలక్షన్ ఏజెంట్లు హాలులో లేని సమయంలో మాత్రమే రిటర్నింగ్ అధికారి టేబుల్ కౌంటింగ్ ఏజెంట్ ను హాలులోని అన్ని టేబుల్స్ వద్దకు తిరగడానికి అనుమతిస్తారు.
- ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఫలితాలు వెల్లడించే వరకు కౌంటింగ్ ఏజెంట్లు హాలులో నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉండదు.
- కౌంటింగ్ హాలు వద్ద ఎటువంటి ఆహార ఏర్పాట్లు ఉండవు.
- కౌంటింగ్ హాలు లోపలికి సెల్ ఫోన్లను కూడా అనుమతించరు. ఎన్నికల సంఘ పరిశీలకులకు ఫోన్లను అనుమతించినా వాటిని సైలెంట్ మోడ్‌లో ఉంచుకోవాల్సి ఉంటుంది.
- కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ ఓట్లతో మొదలవుతుంది. 30 నిమిషాల తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
ఈవీఎంలో ఓట్లు లెక్కింపు అంత ఈజీ కాదు- కౌెంటింగ్ ఏజెంట్లు ఏం చేయాలంటే! - EVM VOTES COUNTING
పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు ఎలా? - తిరస్కరణకు అవకాశాలెన్నో! - Postal Ballot