Contractors Worried about Pending Bills in Pulivendula In Ap : ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర ఓటమి తర్వాత తొలిసారి పులివెందులకు వచ్చిన మాజీ సీఎం జగన్‌ను స్థానిక నేతలు ఉక్కిరిబిక్కిరి చేశారు. పెండింగ్ బిల్లులు సంగతి తేల్చాలంటూ నిలదీయడంతో తన పర్యటన అర్థాంతరంగా ముగించుకుని సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా పులివెందుల నివాసంలో మూడురోజులు ఉండటంతోపాటు ప్రజలను నేరుగా కలుసుకునే అవకాశం ఇచ్చారు.
దీంతో చాలామంది గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిల గురించే ఆయన వద్ద ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నేతలకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పాలుచేసిన విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు వారు కూడా అదే పంథా అనుసరిస్తే తమ పరిస్థితి ఏంటని వారు జగన్ వద్ద వాపోయారు.
EX CM Jagan Bangalore Tour Reasons : పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ కింద 2019-20 ఆర్థిక సంవత్సరంలో 963 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిల్లో చాలా వరకు ప్రజలకు ఉపయోగం లేని పనులే అయినా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలను మచ్చిక చేసుకునేందుకు ఇష్టానుసారం పనులు అప్పగించారు. వీటిల్లో చాలావరకు పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరిలో బడా నేతలకు మాత్రం ముందు బిల్లులు చెల్లించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిన్నా, చితకా నేతల బిల్లులను పెండింగ్‌లో పెట్టింది.
పాడా పనులు, బిల్లుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని వీటిపై విచారణ జరపాలని తెలుగుదేశం నేతలు పట్టుబడుతున్నారు. అందుకు అనుగుణంగానే పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిని రిలీవ్ చేయకుండా కూటమి ప్రభుత్వం అక్కడే ఉంచింది. దీంతో పాడా పనులు చేసిన చిన్నచిన్న గుత్తేదారుల గుండెల్లో రైళ్లు పరుగుడెతున్నాయి. తమ బిల్లుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిక : పులివెందుల పురపాలక సంఘానికి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు జగన్ సతీమణి భారతి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. తమ పెండింగ్ బిల్లులు ఇప్పించకుంటే పార్టీకి రాజీనామా చేస్తామని పదిమంది కౌన్సిలర్లు హెచ్చరించారు. ఇప్పటికే 230 కోట్లు వరకు బిల్లులు పెండిగ్‌లో ఉండగా మరో వందకోట్ల వరకు బిల్లులు అప్‌లోడ్ చేయాల్సి ఉంది. వీటికి పూచీకత్తు ఇవ్వాలని బాధితులు జగన్‌ను నిలదీశారు.
మూడు రోజులకే బెంగళూరు జంప్ : కాలేటివాగు ప్రాజెక్టుకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, పులివెందుల వైద్య కళాశాల నిర్మాణ గుత్తేదారుకు ఎన్నికలకు ముందే చెల్లింపులు చేసి మాకు మాత్రం ఆపుతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా మూడు రోజుల పాటు వచ్చిన వారంతా పెండింగ్ బిల్లులు గురించే నిలదీయంతో జగన్ అసహనానికి గురయ్యారు. ఇప్పుడు కూడా నన్ను వదిలిపెట్టరా? అంటూ మండిపడినట్లు సమాచారం. ఐదు రోజుల పాటు పులివెందులలోనే ఉండాలని వచ్చిన జగన్ ఈ పెండింగ్ బిల్లుల గోల దెబ్బకు మూడు రోజులకే బెంగళూరు పలాయమనయ్యారు.