Congress Whip Adi Srinivas on BRS : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కావడంతో బీఆర్ఎస్ ఓర్వలేక దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న సీఎంపై బీఆర్ఎస్ సామాజిక మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారన్న ఆది శ్రీనివాస్, పెట్టుబడుల స్వర్గదామంగా రాష్ట్రాన్ని మార్చుతున్నారన్నారు. గత పదేండ్ల కాలంలో సూటు బూటు వేసుకుని దావోస్ వెళ్లిన కేటీఆర్ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారని, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఒప్పందం చేసుకున్న కంపెనీలకు గత ప్రభుత్వం సరైన వసతులు కల్పించకపోవడంతోనే ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి విజయాన్ని తక్కువ చేసి చూపించేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కష్టపడుతోందని విమర్శించారు. బుర్ర లేని వాళ్లు కొందరు కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారని ధ్వజమెత్తారు. అంగుళం భూమి కూడా కేటాయించక ముందే మనీలాండరింగ్ జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు.
సూటు బూటు వేసుకుని హడావిడి : తప్పులు చేసి తీహార్ జైల్లో ఎవరున్నారో ప్రజలకు బాగా తెలుసని ఎమ్మెల్సీ కవితను ఉదేశిస్తూ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. పదేళ్లలో సూటు బూటు వేసుకుని కేటీఆర్ చేసిన హడావిడికి, రేవంత్ రెడ్డి కేవలం 8 నెలల్లోనే సమాధానం చెప్పారన్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, మరోవైపు ప్రైవేట్ ఉద్యోగాల కల్పన చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
తెలంగాణ అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమని, విదేశీ పర్యటనల పేరుతో దుబాయి వెళ్లి సొంత పనులు చక్కబెట్టుకున్న మీతో(బీఆర్ఎస్) రేవంత్‌కు పోలికా? అని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి దిగజారవద్దని బీఆర్ఎస్ నేతలకు ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే తమ పని ఖతం అవుతుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని పేర్కొన్నారు.
'సూటు బూటు వేసుకుని దావోస్‌కు మీరు వెళ్లి రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు మీరు తీసుకొచ్చారు. ఆ చర్చకు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. 8 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒప్పందాలు రేపు అమలు కాబోతున్నాయి. యువతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగ కల్పనకు తోడ్పడుతోంది మా ప్రభుత్వం'- ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్