Telangana Congress Joinings : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని పెంచుకునే దిశలో ముందుకు వెళ్తోంది. ప్రతిపక్షంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ శాసన సభాపక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. 'ఆపరేషన్ ఆకర్ష్' పేరుతో కొనసాగుతున్న చేరికల పరంపర, మరింత ఉద్ధృతమయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్‌లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు : ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో 13 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు అధికంగా ఉంటాయని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Congress High Command On Joinings : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో సీనియర్ నేత జీవన్‌రెడ్డి అలకబూనడంతో చేరికల విషయంలో ఒక విధానాన్ని పాటించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక నాయకత్వం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తేనే ఎమ్మెల్యేల చేరికకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Deepa Das Munshi On Congress Joinings : ఇటీవలే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ మీడియాతో మాట్లాడుతూ హస్తం పార్టీ తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని అన్నారు. అదే సమయంలో తమ పార్టీ నాయకుల మనోభావాలను ఏ విధంగానూ దెబ్బ తీయమని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఇంతకు ముందు చాలా మంది నాయకులు చేరారని, ఇకపైనా చాలా మంది చేరనున్నారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.