Congress MP Candidates Telangana 2024 : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 9 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తును మరింత వేగవంతం చేసింది. రెండు రోజుల క్రితం స్క్రీనింగ్ కమిటీ సమావేశమై నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. 17 లోక్‌సభ స్థానాల్లో (Telangana Lok Sabha Elections 2024) కనీసం 14 లోక్‌సభ స్థానాలైనా హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా, పార్టీల వారీగా సర్వేలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు సర్వే ద్వారా నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది.
Telangana Lok Sabha Elections 2024 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, నాలుగు గ్యారెంటీల అమలు కలిసివస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు కార్యాచరణ రూపొందించడం, రైతు బంధు అమలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శాఖలపై లోతైన దర్యాప్తు, నీటి ప్రాజెక్టుల్లో అవినీతి బహిర్గతం, ప్రజాధనం దుర్వినియోగం జరగడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి లోతైన దర్యాప్తు జరిపించిన విషయమూ తెలిసిందే.
రాష్ట్రంలో మరింత మెరుగైన కాంగ్రెస్ పరిస్థితి - 12 లోక్‌సభ స్థానాల్లో పెరిగిన ఓటర్ల శాతం
మరోవైపు సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న దాదాపు రెండున్నర లక్షల ధరణి దరఖాస్తుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 9వ తేదీ వరకు ప్రత్యేక రెవెన్యూ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలలో సమస్యల పరిష్కారానికి సమయాన్ని సైతం నిర్దేశించింది. సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడంతో క్షేత్రస్థాయిలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేల్లో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అధిక సీట్లు గెలుచుకోగలమన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.
Congress MP Candidates Latest Updates : ఇటీవల సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై ఒక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌రెడ్డి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ పేరు, కరీంనగర్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచల రాజేందర్‌రావుల పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పేరుతో పాటు ఉజ్వల రెడ్డి, సిద్ధా రెడ్డి పేరూ తెరపైకి వచ్చింది.
అగ్రనేతలొస్తే ఓకే లేదంటే మాకే - ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ
మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఫయీమ్ ఖురేషిని నిలబెట్టేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్నం సునీత మహేందర్‌రెడ్డి పేరును ప్రతిపాదించగా మహబూబ్ నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి బరి (Congress Leader Mallu Ravi)లో నిలవనున్నట్లు సమాచారం. నల్గొండ నుంచి మాజీ మంత్రి కుమారుడు రఘువీర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి పేర్లనూ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్యతో పాటు మరో మహిళ పేరూ ప్రతిపాదించినట్లు సమాచారం. ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, అదే విధంగా మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేరు ప్రతిపాదనకు వచ్చినట్లు సమాచారం. భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌రెడ్డి పేరును ప్రతిపాదించే దిశలో స్క్రీనింగ్ కమిటీ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Congress Lok Sabha Candidate Selection : హైదరాబాద్, ఆదిలాబాద్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలకు సంబంధించి సరైన అభ్యర్థుల కోసం కసరత్తు జరుగుతోంది. ఇదిలా ఉండగా కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ వరంగల్, నాగర్ కర్నూల్, మల్కాజ్‌గిరి ఈ మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి వ్యూహరచన చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకెళ్లేందుకు అవసరమైన కసరత్తు కొనసాగుతోంది. మరోవైపు బరిలో దిగనున్న అభ్యర్థులపై సైతం సునీల్ కనుగోలు సర్వే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ పేర్ల జాబితాతో పాటు సర్వేల ఫలితాల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపికపై త్వరితగతిన నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటిస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
12 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన కాంగ్రెస్! - ఇక తేలాల్సింది ఆ 5 సీట్లే
ఇకపై జీహెచ్‌ఎంసీ కాదు - హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!