Congress Leaders Election Campaign 2024 : రాష్ట్రంలో ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం పోటీ చేసే అభ్యర్థులు ఎవరో ఈసీ ప్రకటించింది. దీంతో అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో ప్రచారం మరింత ముమ్మరం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 13 నుంచి 14 స్థానాల్లో గెలిచే విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్యంగా పెట్టుకుని ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రోజుకు రెండు నుంచి మూడు సభల్లో పాల్గొని నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇదే స్ఫూర్తితో పార్టీ అభ్యర్థులు తమ నియోజకవర్గంలో ఓటర్ల దగ్గరకు వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.
Jeevan Reddy Election Campaign in Nizamabad : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ వందరోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ చేస్తామని దొంగ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఫ్యాక్టరీ నామరూపాలు లేకుండా చేశారని ఆరోపించారు. పసుపు బోర్డు తీసుకొస్తానని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎంపీ అర్వింద్ మండల కేంద్రాన్ని ఒక్కసారి కూడా సందర్శించలేదని విమర్శించారు.
"ఆగస్టు 15 నాటికి రుణ మాఫీ చేస్తాం. బీఆర్ఎస్ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నామరూపాలు లేకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. పసుపు బోర్డు తీసుకువస్తామన్న ఎంపీ అరివింద్ మాట తప్పారు. " - జీవన్ రెడ్డి, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
MP Candidate Vamsi Krishna Comments on BRS : పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు పెద్దపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి కనగర్తి, కాపులపల్లి, రాగినేడు, కురుమ పల్లి, బ్రాహ్మణపల్లి, బొంపల్లి గ్రామాల్లో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపిస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని నాగర్కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు గ్యారంటీలను అమలు చేసే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అందువల్లే వారి నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.