Congress Lok Sabha Election Campaign 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి దూకుడు పెంచింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి 50 వేల మెజార్టీతో నీలం మధు ముదిరాజ్‌ను గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. దుబ్బాకలో ఆయనకు మద్దతుగా ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చెప్పిన విధంగా ఐదు గ్యారంటీలను అమలు చేసిందని మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.
మెదక్‌లో జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి నీలం మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ స్థానంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన తనకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని మీ అందరి దీవెనలతో ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మనోహరాబాద్ మండలాన్ని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చూస్తానని తెలిపారు.
Ministers Roadshow In Telangana : కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి తెలిపారు. మహబూబాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు మురళీనాయక్, రామచంద్రు నాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రహ్మణపల్లి చెక్ పోస్ట్ నుంచి ఏటూరు నాగారం వరకు మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థి పొరిక బలరాం నాయక్‌కు మద్దతుగా మంత్రి సీతక్క బైక్ ర్యాలీ చేపట్టారు. మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండు కోవాలని బీజేపీ చూస్తుందని ప్రజలందరూ గమనించి వారి ఎత్తుగడలను తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
నల్గొండ జిల్లా దామరచర్ల సహా పలు గ్రామాల్లో కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. దామరచర్లలో రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లో దోశ వేసి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేశామని తెలిపారు .
ఖమ్మం కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో సినీ హిరో విక్టరీ వెంకటేశ్ : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతుగా ప్రముఖ సినీనటుడు వెంకటేశ్ ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో చేపట్టిన రోడ్ షోలో పాల్గొన్న ఆయనను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. తన వియ్యంకుడు, కాంగ్రెస్ అభ్యర్థి అయిన రఘురాం రెడ్డికి ఓటేసి గెలిపించాలంటూ కోరారు. వెంకటేశ్ రాకతో ఖమ్మం రహదారులు కిక్కిరిసిపోయాయి.