Congress on MP Elections 2024 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయి ప్రజలు ఆ పార్టీని ఓడించారని, అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ అనుభవం ఉన్న దానం నాగేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, తప్పనిసరిగా ఆయన కేంద్ర మంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఇవాళ హైదరాబాద్‌లోని నాంపల్లిలో సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా నాంపల్లి పార్టీ ఇన్ఛార్జీ ఫిరోజ్ ఖాన్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.
నియంత పాలనకు బీజేపీ నిదర్శనం : మరోవైపు బీజేపీ నియంత పాలనకు నిదర్శనమే కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై కేసు నమోదని మంత్రి సీతక్క ఆక్షేపించారు. ప్రశ్నించే గొంతును అణిచివేస్తూ నియంతృత్వ పాలన కొనసాగించడమే ఆ పార్టీ లక్ష్యమని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీజేపీ, బీఆర్ఎస్లు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. మొన్నటి వరకు రైతు బంధు వేయరని దుష్ప్రచారాలు చేసిన పార్టీలు, నేడు రైతు భరోసా నిధులు వేస్తే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా మంత్రి సీతక్క ఇంటింటా ప్రచారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ తమ పార్టీని ఆదరించాలని కోరారు. కేసులకు భయపడేవారు కాంగ్రెస్‌లో ఎవరూ లేరని స్పష్టం చేశారు. ప్రస్తుత ఎంపీ అభ్యర్థి సుగుణపై గతంలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తే 52 కేసులు నమోదు చేశారని సీతక్క తెలిపారు.
ప్రైవేటీకరణే ఆ పార్టీల లక్ష్యం : బీజేపీ, బీఆర్ఎస్లు సింగరేణి సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆరోపించారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన సింగరేణి సంస్థను మాజీ ఎంపీ కాకా వెంకట్‌స్వామి రూ. 500 కోట్లు ఇచ్చి లాభాల బాటకు తీసుకొచ్చారని అన్నారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో సివిల్ డిపార్ట్‌మెంట్, జీఎం కార్యాలయంలో నిర్వహించిన బాయి బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కార్మికులను, సింగరేణి భద్రత సిబ్బందిని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆప్యాయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కిందని ఆయన చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ - అభ్యర్థులకు మద్దతుగా మంత్రుల ప్రచారం - Congress Election Campaignగెలుపే లక్ష్యంగా