Congress Leaders Meet MLA Kadiyam Srihari : మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరటం దాదాపు ఖాయమైంది. కడియం కుమార్తె, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా, కాంగ్రెస్ నాయకులు శ్రీహరితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలకు, కడియం సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్, పీసీసీ నేతలు మల్లు రవి, సంపత్ కుమార్, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కడియంను కలిసి, కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీలోకి రావాల్సిందిగా కోరామని దీపాదాస్ మున్షీ తెలిపారు.
కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఏఐసీసీ తరఫున వచ్చాం. పార్టీని బలోపేతం చేసేందుకు వారిరువురు కాంగ్రెస్‌లో చేరతారని ఆశిస్తున్నాం. ఏఐసీసీ, పీసీసీ నాయకులంతా కడియం శ్రీహరిని కలిశాం. వారి నుంచి వచ్చే సమాధానం కోసం వేచి చూస్తున్నాం. - దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ
మరోవైపు కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ ప్రజల్లో ఆదరణ కోల్పోతుందని వ్యాఖ్యానించారు. అనుచరులు, శ్రేయోభిలాషులతో సమావేశమై, వారి అభిప్రాయం మేరకు నిర్ణయం ప్రకటిస్తానని కడియం వెల్లడించారు.
ప్రజాబలం ఉంటే కడియం శ్రీహరి రాజీనామా చేసి గెలవాలి : బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్ తరఫున పోటీ చేయలేనన్న కావ్య : వరంగల్ లోక్‌సభ స్ధానంలో బీఆర్ఎస్ తరపున పోటీకి దిగిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. పార్టీ నాయకత్వంపై వస్తున్న అవినీతి, భూ కబ్జా ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్, మద్యం కుంభకోణం తదితర అంశాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని, ఆ లేఖలో పేర్కొన్నారు. జిల్లాలోనూ స్ధానిక నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేదని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం వల్ల పార్టీకి మరింత నష్టం చేకూరుతోందని కావ్య తన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేనని భావించి వైదొలుగుతున్నానని కేసీఆర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మన్నించాలని లేఖలో చెప్పారు.
ఎన్నికల ముంగిట బీఆర్ఎస్కు బిగ్ షాక్ - వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య
అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ : వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేయనున్నారు. ఇదిలా ఉండగా, సీనియర్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ను వీడతారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతుండగా, కాంగ్రెస్ నేతలు పలువురు కడియంతో మంతనాలు జరిపి కావ్యకు టిక్కెట్ ఇప్పించేలా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్కు వరుస షాక్‌లు - కాంగ్రెస్‌లో భారీ చేరికలు - హస్తంతో టచ్‌లో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు!