Congress Leader Kodanda Reddy Comments on Kishan Reddy : రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడినా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కనీసం పట్టించుకోలేదని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. వడదెబ్బకు రాష్ట్రంలో 97 మంది మరణిస్తే స్పందించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Kodanda Reddy on Drought Conditions in Telangana : రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని కోదండరెడ్డి అన్నారు. తెలంగాణలో అనేక జిల్లాల్లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజలను కాపాడేందుకు నిధులు ఇవ్వమని రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని కిషన్‌రెడ్డి కోరలేదని విమర్శించారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరవు వచ్చిందని, అప్పట్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని అన్నారు. కరవు పరిస్థితుల పరిశీలన కోసం ప్రధాని మన్మోహన్‌సింగ్ కమిటీని వేసి రూ.2,800 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.2 కూడా ఇవ్వలేదని కోదండరెడ్డి మండిపడ్డారు.
'ధరణిలో లోపాలు అనేకం - వీలైనంత త్వరలో మధ్యంతర నివేదిక ఇస్తాం'
"రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా సీఎం ఆదేశాలు ఇచ్చారు. కర్ణాటక నుంచి నీరు తేవడానికి చర్చలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విమర్శలు మానుకోవాలి. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీ లేదు. కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తెప్పించలేకపోయారు." - కోదండరెడ్డి, జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
Anvesh Reddy Comments on BRS : బీఆర్ఎస్ నేతలు పనిలేక ధర్నాలు చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ సెల్ ఛైర్మన్ అన్వేశ్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంట పరిహారం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. గతంలో సిరిసిల్లలో వడ్లు కల్లాలలో మొలకలు వచ్చినా కేటీఆర్ ఎందుకు స్పందించలేదని అడిగారు. రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు. వర్షాకాలం పంట నుంచి వరికి రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల సమస్య ఉందని, గత ప్రభుత్వం పట్టించుకోనందున ఈ సమస్య పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విత్తానాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని వివరించారు.