CM Revanth Delhi Tour : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులోపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 17వ తేదీన జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లు హాజరు కానుండడంతో మరుసటి రోజున మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులోపు కేబినెట్ విస్తరణ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఈ అంశంపై హైకమాండ్ చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జాప్యం అవుతూ వస్తోంది.
నలుగురికి ఛాన్స్! : కేబినెట్లో నాలుగు మంత్రి పదవులను భర్తీ చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులున్నారు. ఇప్పుడు కొత్తగా నలుగురికి అవకాశం దక్కనుందని సమాచారం. ఈ అంశంపై చర్చ జరిగే నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు కూడా ఈనెల 17 సాయంత్రం కానీ, ఈ నెల 18వ తేదీ ఉదయం కానీ దిల్లీ వెళ్లాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాల విషయంలో ఎక్కడో ఒకచోట రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసీసీ రాజీ పడాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరోవైపు ఈనెల 17న సీడబ్ల్యుసీ సమావేశానికి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ సభ్యులను ఆదేశించింది. ఈ భేటీకి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లు హాజరు కానున్నారు. సీడబ్ల్యూసీ సభ్యులైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డిలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. భేటీలో ప్రధానంగా ఇటీవల జరిగిన హరియాణా ఎన్నికల్లో ఓటమి పాలు కావడంపై మేథోమథనం చేస్తారని, లోటుపాట్లపై చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా త్వరలో జరగబోయే మహారాష్ట్ర, ఝార్ఘండ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సీడబ్ల్యూసీలో చర్చిస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం కోసం ఈ నెల 16వ తేదీ రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ 16వ తేదీ రాత్రి కానీ, 17వ తేదీ ఉదయం కానీ వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
"బీఆర్‌ఎస్‌కు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు - పేద విద్యార్థులు చదివే స్కూళ్లకు మాత్రం తిలోదకాలు"
'60 రోజుల్లో బీసీ కుల గణన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం - ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు'